ఛలో విశాఖకు సిద్దం కండి...: జనసైనికులకు పవన్ పిలుపు
ఇసుక కార్మికుల తరపున పోరాడేందుకు తాను సిద్దంగా వున్నట్లు జనసేన చీఫ్ పవన్్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలో ఇసుక కొరత పై పోరాటాన్ని విశాఖ నుండి ప్రారంభిస్తున్నట్లు పవన్ వెల్లడించారు.
గుంటూరు: రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత కారణంగా నిర్మాణరంగంలోనే కాదు వివిధ రంగాల్లో పనిచేసే నిరుపేదలు ఉపాధిని కోల్పోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆకలి భాదతో అలమటిస్తున్న పేద కార్మికుల తరపున పోరాడేందుకు జనసేన పార్టీ సిద్దమైందన్నారు. ఈ క్రమంలో నవంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల భారీ యాత్రను తలపెట్టినట్లు పవన్ ప్రకటించారు.
ఇందులో అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు పాల్గొనాలని పవన్ సూచించారు. జనసేన పార్టీ చేపడుతున్నఈ యాత్రను విజయవంతం చేసి కార్మికులను మద్దతు తెలపాలన్నారు. ఈ మేరకు ఛలో విశాఖ పట్నం పోస్టర్ ను పవన్ విడుదల చేశారు.
ఏపీలో ఇసుక దొరకడం లేదు గానీ ఏపీ ఇసుక మాత్రం ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందన్నారు. ఇసుకమాఫియాను అరికడతామన్న జగన్ ఎక్కడా ఆ దిశగా అడుగులు వేయడం లేదని నిలదీశారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక మాఫియా చేస్తుంటే ఈనాడు వైసీపీ నాయకులు చేస్తున్నారని తిట్టిపోశారు.
Read more సీబీఐ కేసులున్న జగన్ కేంద్రంతో..... పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు...
వైసీపీ ప్రభుత్వంలో నాయకులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మహిళా అధికారులపైనా, జర్నలిస్టులపైనా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా అందరు బాగుంటేనే రాష్ట్రం బావుందని పవన్ తెలిపారు. అలా అందురూ బావుండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నారు. తాను కొన్ని ఆశయాలతో ప్రజలకు సేవ చెయ్యాలనే రాజకీయాలోకి వచ్చానని...అందువల్లే గత ఎన్నికల్లో డబ్బు,సారాను వ్యతిరేకించానని అన్నారు.
Read more ఓడిపోతే బెంబేలెత్తిపోను, తలదించను: పవన్ కళ్యాణ్...
మనమీద కేసులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి పెట్టలేమన్నారు. అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే ఎలా పనులు జరుగుతాయని ప్రశ్నించారు. శాంతి భద్రతల,చట్టాలు సంరక్షించాల్సిన ముఖ్యమంత్రిపైనే కేసులుండటం మంచిదికాదన్నారు.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై కోడికత్తితో దాడి చేసిన కేసు ఏమైందన్నారు. కోడికత్తి దాడి కేసులో ఆంధ్రాపోలీసులపై నమ్మకం లేదని సీబీఐ కోర్టుకు వెళ్తామన్న జగన్ ఆ విషయాలను అధికారంలోకి వచ్చిన వెంటనే మరచిపోయారన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత చిన్నాన్న మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసినా దానిపై ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదన్నారు. సీబీఐ విచారణ కోరిన సీఎం జగన్ ఇప్పుడు ఆ కేసును ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
గత ఎన్నికల్లో గెలుపుకోసం దాదాపు 160 కోట్ల ఖర్చు పెట్టారని ఆరోపించారు. అందువల్లే వైఎస్ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. 151 సీట్లతో అఖండ విజయం సాధించడం వెనుక రహస్యమిదేనని అన్నారు.