అమరావతి: రాష్ట్రంలోని సూర్యలంక, భోగాపురం, దొనకొండ తదితర ప్రాంతాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్  ఏర్పాటు చేసే శిక్షణ తదితర కేంద్రాలకు తగిన భూములను కేటాయించాలని ఎయిర్ వైస్ మార్షల్ పతార్గే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి విజ్ణప్తి చేశారు. ఈ మేరకు సూర్యలంక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సదరన్ ఎయిర్ కమాండ్, గ్రూప్ కెప్టెన్ ఎయిర్ వైస్ మార్షల్ పతరంగ్ నేతృత్వంలోని ఎయిర్ పోర్సు అధికారులు అమరావతి సచివాలయంలో సిఎస్ ను కలిశారు. 

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ... ఇండియన్ ఎయిర్ ఫోర్సు సూర్యలంక, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న శిక్షణా కేంద్రాలకు తగిన భూములు కేటాయించే అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. సూర్యలంక, దొనకొండలతో పాటు విజయవాడ, భోగాపురం విమానాశ్రయాలను ఆనుకుని వారు ఏర్పాటు చేసే ఎయిర్ ఫోర్స్ కేంద్రాలకు తగిన భూములను నిర్దిష్ట ధరల ప్రకారం కేటాయించే సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను ఆమె ఆదేశించారు.

read more  అశోకుడు, అక్బర్ చక్రవర్తుల తరహాలో జగన్ పాలన..: కర్నూల్ ఎంపీ

ఎయిర్ వైస్ మార్షల్ మాట్లాడుతూ... ఇప్పటికే సూర్యలంక, దొనకొండ, భోగాపురం, విజయవాడలో ఎయిర్ ఫోర్స్ కేంద్రాలకు భూములు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చామని వాటిని పరిశీలించి సకాలంలో భూములు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, కరికల వల్లవన్, ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, కృష్ణా, గుంటూర్ జిల్లాల కలెక్టర్లు ఇంతియాజ్, శామ్యూల్ ఆనంద కుమార్, విజయవాడ విమానాశ్రయం డైరెక్టర్ మధుసూదనరావు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.