అమరావతి: రాజధానిని తమ ప్రాంతం నుండి తరలించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ ఆలోచిస్తున్నారని ఆరోపిస్తూ అమరావతి రైతులు, ప్రజలు నిరసన బాట పట్టారు. ఈ క్రమంలో రాజధానిపై శుక్రవారం జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు భావించిన అమరావతి ప్రజలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. 

ఈ క్రమంలోనే ఉద్దండరాయునిపాలెం,వెలగపూడిలో ఉద్రిక్తలను కవర్ చేసేందుకు వెళ్లిన  మీడియా ప్రతినిధులపై కొందరు నిరసనకారులు దాడిచేశారు. అంతేకాకుండా ఓ మీడియా వాహనాన్ని ధ్వంసం చేశారు. మరికొన్ని  చోట్ల నిరసనకారులు పోలీసులపై కూడా దాడికి పాల్పడి గాయపర్చారు. వీటన్నింటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఐజి వినీత్ బ్రిజల్  తెలిపారు. 

రైతుల ముసుగులో కొంతమంది బయట వ్యక్తులు దాడికి పాల్పడినట్లు గుర్తించామని అన్నారు. ఆందోళనకారుల దాడిలో ఓ మహిళా రిపోర్టర్ తో పాటు పలువురు జర్నలిస్ట్ లు గాయపడగా ఓ మీడియా వాహనం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారు. ఇది చాలా హేయమైన చర్య  అని... దాడికి పాల్పడిన వారిని గుర్తించేపనిలో పడ్డామని అన్నారు.

read more  ఆ నిర్ణయానికి స్థానిక సంస్థల ఎన్నికలే రెఫరెండం: స్పీకర్ తమ్మినేని

ఇలా మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్దేశపూర్వకంగానే బయట వ్యక్తులు ఈ దాడులకు పాల్పడుతూ రెచ్చగొడుతునట్లు  గుర్తించామని... కొన్ని ప్రాంతాలలో పోలీసులనే టార్గెట్ గా చేసుకుని దాడికి పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి దాడులకు  పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఐజీ హెచ్చరించారు. 

అమరావతి నుండి రాజధానిని మార్చవద్దని  కోరుతూ 10 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ తరుణంలో  శుక్రవారం ఉద్దండరాయునిపాలెం నుండి సచివాలయం వైపుకు వెళ్లే మీడియా ప్రతినిధుల వాహనంపై స్థానికులు దాడికి దిగారు. సెక్రటేరియట్‌కు వెళ్లే ప్రధాన దారిలో ఈ ఘటన చోటు చేసుకొంది. మీడియా వాహనాన్ని అడ్డుకున్న ఆందోళనకారులు కర్రలతో దాడికి దిగారు. దీంతో కారు అద్దాలు పగిలిపోయాయి. కారులో ఉన్న మీడియా ప్రతినిధులకు కూడ గాయాలయ్యాయి.

ఈ ప్రమాదాన్ని పసిగట్టిన మీడియా వాహనం డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వెనక్కు నడిపాడు. అయితే వెనుకే వస్తున్న వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి.సుమారు 30 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కారులో ఉన్న మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. దీంతో  ఇతర మీడియా ప్రతినిదులు వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సమక్షంలోనే మీడియా ప్రతినిధులపై స్థానికులు దాడికి దిగారు.

read more  ముగిసిన ఏపి కేబినెట్ భేటీ...కీలక నిర్ణయాలివే
 
ఇతర మీడియా ప్రతినిధులు కూడ ఈ దాడిని నివారించే ప్రయత్నించే చేశారు.ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు కూడ మీడియా ప్రతినిధులు తీసుకెళ్లారు. ఈ ఘటనపై విచారణ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.
 
జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎంకు ఇచ్చిన రోజున కూడ అమరావతి పరిసర గ్రామాల్లో కూడ  ఇదే రకంగా మీడియా ప్రతినిధులపై దాడులు జరిగాయి. బాధితుల నుండి పోలీసులు ఫిర్యాదులను స్వీకరించనున్నారు.