పింఛను డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో భార్యను కర్రతో కొట్టి చంపాడో భర్త. ఈ దారుణమైన ఘటన గుంటూరు జిల్ల అమృతలూరు, యలవర్రులో జరిగింది. 

యలవర్రుకు చెందిన ఎఫ్రాయమ్మ, సామేలు భార్యాభర్తలు. వీరిద్దరికీ తొంభైయేళ్లు దాటాయి. నవంబర్ మొదటి రోజు ఎఫ్రాయమ్మ సామాజిక పింఛను తీసుకుంది. అందులో నుండి తన ఖర్చులకోసం 200 ఇవ్వవమని సామేలు అడిగాడు.  దానికి ఆమె ఇవ్వనంది. 

దీంతో కోపానికి వచ్చిన సామేలు దగ్గరే ఉన్న కర్రతో ఎఫ్రాయమ్మ తలమీద గట్టిగా కొట్టాడు. వృద్ధురాలవడంతో దెబ్బలు తట్టుకోలేక ఆమె అక్కడికక్కడే చనిపోయింది. వీరికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. 

కొడుకు ఏసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చుండూరు సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.