మాకు టైం వస్తుంది.. దెబ్బకు దెబ్బ తప్పదు: వైసీపీకి టీడీపీ నేతల హెచ్చరిక
అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఏనాడు వైసీపీ మాదిరిగా అరాచకాలకు పాల్పడలేదని, అలా చేసుంటే, వైసీపీ ఎప్పుడో కనుమరుగయ్యేదన్నారు
వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలు, నేతలతోపాటు, తమ మాటవినని వారిపై అక్రమకేసులు, బహిరంగదాడులు, వేధింపులు ఎక్కువయ్యాయన్నారు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. మంగళవారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పల్నాడు ప్రాంత వైసీపీ బాధితులకు టీడీపీ తరుపున నష్ట పరిహారం కింద నగదు పంపిణీ చేశారు.
అనంతరం ఆనందబాబు మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఏనాడు వైసీపీ మాదిరిగా అరాచకాలకు పాల్పడలేదని, అలా చేసుంటే, వైసీపీ ఎప్పుడో కనుమరుగయ్యేదన్నారు.
అక్రమకేసులతో వేధించి కోడెలను బలితీసుకున్న జగన్‌ప్రభుత్వం, యరపతినేని, చింతమనేనిపై కూడా కక్షసాధింపులకు పాల్పడుతోందని నక్కా ఆరోపించారు. దాడులతో ఎల్లకాలం పాలనసాగించలేరన్న విషయాన్ని వైసీపీ ప్రభుత్వం గుర్తించాలని ఆయన హితవు పలికారు.
Also Read:బీజేపీ- వైసీపీల మధ్య చెడితే....దూరేందుకు బాబు రెడీ: అవంతి వ్యాఖ్యలు
మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నామనే అహంకారంతో తప్పుడు కేసులతో వేధిస్తున్న వారిని దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఆరిపోయేదీపమని, అధికారం కొత్త కాబట్టే ఆ పార్టీ నేతల్లో అహంకారం ఎక్కువైందని ఆయన ఎద్దేవాచేశారు. పోలీస్‌శాఖను అడ్డుపెట్టుకొని ఎన్నాళ్లో ప్రభుత్వాన్ని నడపలేరని, పాలకులు ఎప్పుడు జైలుకు వెళతారో కూడా తెలియని పరిస్థితులున్నాయని యరపతినేని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ.. పల్నాడులో వైసీపీ దాష్టీకాలకు బలైన, టీడీపీ కార్యకర్తలను ఆదుకునే క్రమంలో చంద్రబాబు పోరాటం చేశాకే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదని గిరిధర్ స్పష్టం చేశారు.
Also Read:చంద్రబాబుకు గట్టి దెబ్బే: వైసీపీ గూటికి కేఈ సోదరులు..? మంత్రి రాయబారం
ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ.. ఒక్క అవకాశం ఇవ్వడంటూ ప్రజల కాళ్లావేళ్లాపడి బతిమలాడిన వైసీపీ, అధికారంలోకి వస్తే, పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని ప్రజలెవరూ ఊహించలేదన్నారు.
జగన్ నాయకత్వంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రం చేరుకుందని అశోక్ బాబు ఎద్దేవా చేశారు. చుండూరు ఘటన తర్వాత, ఇన్నేళ్లకు వైసీపీ ప్రభుత్వ పుణ్యమా అని మానవహక్కుల కమిషన్ రాష్ట్రంలో పర్యటనకు రావాల్సి వచ్చిందన్నారు.
వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలకు బలైన గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని జంగమేశ్వరపాడు, పిన్నెల్లి గ్రామస్తులైన ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 210మంది టీడీపీ కార్యకర్తలకు నష్టపరిహారం కింద నగదు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, టీడీపీనేతలు మన్నవ సుబ్బారావు, ధారునాయక్, మానుకొండ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.