పాఠశాలలపై కూడా ముఖ్యమంత్రి ముద్ర: విద్యామంత్రి ఆదేశం

ఏపిలోని ప్రతి పాఠశాల అభివృద్దిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముద్ర వుండేలా  చూడాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. 

education minister suresh review meeting on education department

తాడేపల్లి :  రాష్ట్రం లోని పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఇంజనీర్ల బాధ్యతలు కీలకమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ‘మన బడి నాడు-నేడు’పై సిబ్బందికి పునశ్చరణ కార్యక్రమం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సురేష్ ఇంజనీర్ లు, విద్యాశాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. 

విద్యాశాఖ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని, విద్యాశాఖ పై జగనన్న ముద్ర ఉండేలా ప్రక్షాళన జరగాలన్నారు. ముఖ్యంగా మౌళిక వసతుల కల్పన విషయంలో గతంలో జరిగిన తప్పిదాల నుంచి అదికారులు బయటకు రావాలని, అంకితభావంతో, ప్రణాళికాబద్ధంగా పనిచేసి ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. 

పాఠశాలల అభివృద్ధికి బడ్జెట్‌లో అత్యధిక శాతం నిధులు కేటాయించటం జరిగిందని, రాష్ట్రంలో పాఠశాలల రూపు మార్చాలనే  నిర్ణయంతో  నవంబర్ 14న మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. తొలిదశలో 15 వేల పాఠశాలల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని,  అవినీతికి తావులేకుండా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేయాలని ఆదేశించారు.

 నాడు-నేడు కార్యక్రమాన్ని పకడ్బందీగా పారదర్శకంగా చేపడతామని అన్నారు. గతంలో నిర్మించిన అదనపు తరగతి గదులు ఎలా ఉన్నాయో తెలుసునని, చెక్ మెజర్మెంట్, నాణ్యత పరిశీలన అన్నీ చేసినా మరి పాఠశాలల్లో నాణ్యత ఎలా ఉందొ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అటువంటి చర్యలకు చరమగీతం పాడాలని, నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

పాఠశాలల అభివృద్ధి చేసి చూపుతామని, ఇప్పటికే ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా పాఠశాలల ఫోటోలు తెప్పించటం జరిగిందన్నారు. మార్పు చేసిన తరువాత ఎలా ఉన్నాయో తప్పక ఫొటోలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనలో పేరెంట్స్ కమిటీ లను భాగస్వాములను చేస్తామని మంత్రి చెప్పారు. 

సోషల్ కాంట్రాక్టింగ్ విధానాన్ని తీసుకువచ్చి పూర్తిగా పారదర్శకంగా పనులు జరిగేలా చూస్తామని చెప్పారు. ఇంకా సమయం ఉందిలే మూడేళ్లలో చేద్దాం అని నిర్లక్ష్యం గ ఉండకుండా నేటి నుంచే ప్రణాళికతో పనులకు కదలాలని అధికారులను మంత్రి సురేష్ ఆదేశించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios