నర్సారావుపేటలో తొలి కరోనా మృతి: పొన్నూరులో ఒకరికి పాజిటివ్
నర్సారావుపేటలో ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకి మరణించినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు కాగా, పొన్నూరులో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. బుధవారంనాడు మృతి చెందిన మల్లెల .శ్రీనివాసరావుకి కరోనా పాజిటీవ్ ఉన్నట్లు తేలింది. .శ్రీనివాసరావు నివాసం ఉండే వరవకట్ట, అతను పని చేస్తున్న రామిరెడ్డి పేటని రెడ్ జోన్ గా ప్రకటించారు.రెండు ప్రాంతాలలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు.
ఇక నుండి రెడ్ జోన్ ప్రాంతంలో ఎవ్వరూ కూడా బయటికి రావడానికి వీలులేదు. ప్రత్యేక వైద్య బృందాలతో ప్రతి ఇంటిని సర్వే చేయిస్తారు. ప్రజలు కరోనా మహమ్మారి నుండి తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది.ప్రజలు అనవసరంగా రోడ్లమీదకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.అధికారులు ఇకమీదట మరింత కఠినంగా వ్యవహరిస్తారని స్థానికశాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
గుంటూరు జిల్లా పొన్నూరుపట్టణంలోని షరాఫ్ బజార్ ఏరియాలో ఒక వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ ఆయన దరిమిలా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డి.ఎస్.పి ఏ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పొన్నూరు పట్టణంలో ఒక కిలోమీటర్ వరికు రెడ్ జోన్, రెండు కిలోమీటర్ల వరకు బఫర్ జోన్ ప్రకటించినట్లు తెలిపారు.పొన్నూరు పట్టణ ప్రజలు స్వీయ నిర్బంధం పాటించి అప్రమత్తంగా ఉండాలని డి.ఎస్.పి ఆదేశించారు.