గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ధూళిపాళ్ల స్థానికులు కరోనా భయంతో వణికిపోతున్నారు. ప్రైమరీ కాంటాక్టు మహిళ నర్సారావుపేటకు వెళ్లి వచ్చింది. ఆ ప్రైమరీ కాంటాక్ట్ మహిళ అత్తకు కరోనా వైరస్ పాజిటివ్ ఉంది. 

దాంతో మహిళ కుటుంబానికి చెందిన ఐదుగురిని క్వారంటైన్ కు తరలించారు. నర్సారావుపేటలో ఇప్పటికే 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే, సత్తెనపల్లిలో పిల్లలతో కలిపి 9 మందిని క్వారంటైన్ కు తరలించారు.

కాగా, గుంటూరులో బిర్యానీ వ్యాపారి అంత్యక్రియలపై వివాదం చోటు చేసుకుంది. దాంతో ఆదివారం అతని అంత్యక్రియలను వాయిదా వేశారు. ఈ రోజు అతని కుటుంబ సభ్యులతో అధికారులు చర్చించనున్నారు. ఆ తర్వాత అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తారు.

బిర్యానీ వ్యాపారి శనివారంనాడు మరణించాడు. అతనికి కరోనా వైరస్ ఉన్నట్లు మరణం తర్వాత తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మృతుడితో సన్నిహితంగా మెలిగినవారి కోసం ఆరా తీస్తున్నారు. అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.