మాచర్లలో కలకలం... జర్మనీ వెళ్లొచ్చిన మహిళకు కరోనా లక్షణాలు
గుంటూరు జిల్లా మాచర్లలో కలకలం రేగింది. విదేశాల నుండి వచ్చిన ఓ మహిళలో కరోనా లక్షణాలు బయటపడటమే ఈ కలకలానికి కారణం.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి మెల్లిగా ఆంధ్రప్రదేశ్ పైనా కోరలు చాస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 3 పాజిటివ్ కేసులు నమోదవగా చాలామంది అనుమానితులు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చినవారే ఇప్పటివరకు ఈ వ్యాధిబారిన పడ్డారు. ఇలా ఇటీవల గుంటూరు జిల్లా మాచర్ల మండలం నుండి జర్మనీకి వెళ్లివచ్చిన ఓ మహిళలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడటం జిల్లాలో కలకలం రేగింది.
గుంటూరు జిల్లా మాచర్ల మండల బెల్లంకొండవారి పాలెంకు చెందిన ఓ మహిళ గత సంవత్సరం(2019) సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు జర్మనీలోని కొడుకు వద్ద వుండి వచ్చింది. తిరుగుప్రయాణంలో ఆమె దుబాయ్ మీదుగా ఇండియాకు చేరుకున్నారు.
read more కర్నూల్ రైల్వేస్టేషన్లో కరోనా కలకలం... సంపర్క్ క్రాంతి రైల్లో అనుమానితుడు
అయితే గత నాలుగు రోజుల నుండి ఆమె తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతూ చికిత్స కోసం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా వ్యాధి లక్షణాలున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో సదరు మహిళ రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు.
సదరు మహిళతో పాటే హైదరాబాద్ నుండి వచ్చిన ఓ యువకుడికి కూడా ఇవే లక్షణాలు ఉండటంతో అతడికి కూడా వైద్య పరిక్షలు నిర్వహిస్తున్న మాచర్ల వైద్య అధికారులు తెలిపారు. వీరిద్దరి పరీక్షల రిపోర్టులు రావాల్సి వుందని అధికారులు పేర్కొన్నారు.