సైరా కోసమే...రాజకీయాల కోసం కాదు: జగన్ తో భేటీపై చిరంజీవి
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను సినీ నటుడు చిరంజీవి సోమవారం నాడు అమరావతిలో కలిశారు. వీరిద్దరి మధ్య సైరా సినిమాపై ఆసక్తికర సంబాషణ సాగింది.
తెలుగు సినీ ఇండస్ట్రీని ఉర్రూతలూగిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి ని చూడాలంటూ ఏపి సిఎం జగన్ ను కోరినట్లు మాజీ కేంద్ర మంత్రి, హీరో చిరంజీవి వెల్లడించారు. అందుకు జగన్ దంపతులు కూడా ఆసక్తి చూపినట్లు పేర్కొన్నారు. జగన్ తో తన భేటీ రాజకీయాలకు అతీతంగా జరిగిందని చిరు స్పష్టం చేశారు. ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలని జగన్ సూచించినట్లు చిరంజీవి వెల్లడించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను సినీ నటుడు చిరంజీవి సోమవారం నాడు అమరావతిలో కలిశారు. సైరా సినిమా చూడాలని సీఎం జగన్ ను సినీ నటుడు చిరంజీవి ఆహ్వానించారు.
రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుండి చిరంజీవి దంపతులు జగన్ నివాసానికి చేరుకొన్నారు. ఈ సమయంలో జగన్ దంపతులు తన నివాసం వద్ద చిరంజీవి దంపతులను సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్ కు సైరా సినిమా విశేషాలను చిరంజీవి వివరించారు.
సినిమా తీసేందుకు ఎలా కష్టపడింది, సినిమా తీసే సమయంలో చోటు చేసుకొన్న ఘటనలను చిరంజీవి సీఎం జగన్ కు వివరించారు. ఈ సందర్భంలోనే సినిమా బాగా తీశారన్నా అంటూ సీఎం వైఎస్ జగన్ సినీ నటుడు చిరంజీవిని అభినందించారట. ఇలాంటి మరెన్నో విజయవంతమైన సినిమాలు తీయాలని జగన్ సూచించారని స్వయంగా చిరంజీవే వెల్లడించారు.
చిరంజీవి అభ్యర్థనతో రెండు మూడు రోజుల్లో విజయవాడలోని పీవీపీ నిసిమా హల్‌లో సీఎం వైఎస్ జగన్ సైరా సినిమాను వీక్షించే అవకాశం ఉంది. ఈ సినిమాను వీక్షించాలని చిరంజీవి ఇచ్చిన ఆహ్వానం మేరకు జగన్ సానుకూలంగా స్పందించారు. గంట పాటు జరిగిన ఈ సమావేశంలో రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదట.కేవలం సైరా సినిమా గురించే వీరిద్దరి మధ్య చర్చ జరిగిందంటూ చిరు తెలిపారు.