అమరావతి: తెలుగు దేశం పార్టీ తరపున  గొదావరి బోటు ప్రమాదం పై న్యాయ విచారణకు డిమాండ్ చేస్తున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావ్ తెలిపారు. ఇది కేవలం టిడిపి పార్టీ డిమాండ్ మాత్రమే కాదు యావత్ ఏపి ప్రజలు, బాధితుల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.

బోటు ప్రమాదం కారణంగా బాధితులుగా మారిన కుటుంబాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. బోటు ప్రమాదం పై ప్రతిపక్షం లో ఉండగా చేసిన వ్యాఖ్యలు సీఎం అయ్యాక జగన్ ఎందుకు పాటించటంలేదని ప్రశ్నించారు.

బోటు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి నీరో చక్రవర్తి లా ప్రవర్తిస్తున్నారు. 300అడుగులు లోతున బోటు పడిపోతే 3వేల అడుగుల పై నుంచి సీఎం ఏరియల్ సర్వే చేసి వెళ్లారని ఎద్దేవా చేశారు. 

ప్రమాదం జరిగి ఇన్నిరోజులవుతున్నా ఇంకా కొన్ని మృతదేహాలు దొరకనే లేదు. వారి కుటుంబాలకు ఏం చెప్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ప్రజలకు నేను జవాబు చెప్పను, సీఎం గా మాత్రం ఉంటాను అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇంకా నిద్రావస్థలోనే ఉంది. 


సెప్టెంబర్18న సంఘటన జరిగితే... ఈరోజు వరకు  సీఎం ఏం సమీక్ష చేసినట్లు?  మంత్రుల కమిటీ కనీసం కూర్చుని సమీక్షించిందా? ప్రభుత్వంలో లేనప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ప్రవర్తించడం జగన్ కే చెల్లుతుందని వెంకట్రావ్ ఆరోపించారు.