జగన్ సర్కార్ కీలక నిర్ణయం...పంచాయితీ కార్యదర్శుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
గ్రామ పంచాయితీల విషయం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయితీ సెక్రటరీల బదిలీలపై విధించిని నిషేధాన్ని ఎత్తివేసింది.
అమరావతి : పంచాయతీ కార్యదర్శుల బదిలీలపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఈమేరకు వైసిపి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని బదిలీ చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. సొంతగ్రామం, మండలంలో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీల ప్రక్రియ ముగిసిన వెంటనే మళ్లీ నిషేధం అమలవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిర్దేశిత మార్గదర్శకాలకు లోబడి ఈ బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం పంచాయితీరాజ్ శాఖను ఆదేశించింది. ఈ బదిలీ ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ను ఆదేశించారు.
కొద్దిరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్న కార్యదర్శులు స్థానిక ఎన్నికలను ప్రభావితం చేయకుండా ఈ చర్యలు చేపట్టారు. అయితే ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.