వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంలో సవరణలు...ప్రకటించిన ప్రభుత్వం
ఇటీవల ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రకటించిన వాహనమిత్ర పథకంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించి ఓ ప్రకటనను ఏపి ప్రభుత్వం విడుదల చేసింది.
అమరావతి: వైఎస్సార్‌సిపి ఇటీవలే ప్రారంభించిన వాహన మిత్ర పథకంలో ప్రభుత్వ స్వల్పంగా మార్పులు చేపట్టింది. లబ్దిదారులు ఎంపికలో గతంలో ప్రకటించిన నిబంధనల్లో కొన్ని సవరణలు చేస్తూ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.
కేవలం తనపేరుపైనే కాకుండా కుటుంబ సభ్యుల పేర్లతో ఆటోలు కలిగివున్న డ్రైవర్లకూ ఈ పథకం వర్తింపజేశారు. లబ్దిదారుడి తండ్రి, తల్లి, కూతురు, తమ్ముడి పేరుతో ఆటో ఉన్నా ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇరువురి పేర్లు వేర్వేరు రేషన్ కార‌్డుల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవట. కానీ బ్యాంకు అకౌంట్ మాత్రం ఆటో యజమాని పేరుతోనే ఉండాలన్న నిబంధన విధించారు.
మీ బాధలు విన్నా, ఇచ్చిన మాటకు కట్టుబడ్డా: వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్...
లబ్దిదారుడికి కుటుంబ సభ్యులతో సంబంధాన్ని పంచాయతీ కార్యదర్శి , బిల్ కలెక్టర్, వార్డ్ వాలంటీర్, గ్రామ వాలంటీర్లు నిర్ధారించనున్నారు.తెల్ల రేషన్ కార్డులో పేరు లేదన్న కారణంతో తిరస్కరించిన దరఖాస్తులకు మరో అవకాశం ఇవ్వనున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే దరఖాస్తు తిరస్కరించిన వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తులు ఆన్ లైన్లో అప్ లోడ్ చేసేందుకు గడువు అక్టోబర్ 31 వరకూ పొడిగించారు. దరఖాస్తును పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్, వార్డ్ వాలంటీర్, గ్రామ వాలంటీర్ల వద్ద నేరుగా ఇచ్చేందుకు కూడా అవకాశం కల్పించారు.
నవంబర్ 8వ తేదీకల్లా దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తవుతుందని పేర్కొన్నారు. నవంబర్ 10 కల్లా దరఖాస్తుల భవితవ్యం కలెక్టర్లు తేల్చనున్నారు. నవంబర్ 15న ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి నగదు బదిలీ జరగనుందని...నవంబర్ 20 కల్లా ఆటో డ్రైవర్లకు వాలంటీర్లు ముఖ్యమంత్రి సందేశంఅందించనున్న ఈ ప్రకటనలో పేర్కొన్నారు.