ఆ మంత్రులు రాజీనామా చేయాల్సిందే...ఎమ్మెల్యేలు కూడా...: సీఎం జగన్ హెచ్చరిక

ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానికసంస్థల ఎన్నికలను ఎలాంటి అక్రమాలు లేకుండా నిర్వహించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగం సిద్దం చేస్తున్నారు. 

AP  CM YS Jagan String Warning to Ministers

అమరావతి: క్యాబినెట్ భేటీ ముగిసిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులతో పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత ఇంఛార్జి మంత్రులదనని సీఎం తెలిపారు. అలాగే ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకుని పార్టీ గెలుపుకోసం పనిచేయాలని సీఎం సూచించారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపైనే కాకుండా ప్రభుత్వం, పాలనా అంశాలపై సీఎం జగన్ మంత్రులతో చర్చించారు. జిల్లాల్లో పార్టీ నాయకత్వం మధ్య ఉన్న గ్రూపు తగాదాల ప్రభావం స్థానికసంస్థల ఫలితంపై పడకుండా చూడాలని సూచించారు. పార్టీ నాయకుల మధ్య తగాదాలు, మనస్పర్థలు వుంటే వాటిని సరిదిద్ది కలిసి పార్టీకోసం పనిచేసేలా చూడాలని మంత్రులను సూచించారు. 

మద్యం,డబ్బు పంపిణీ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం  సూచించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని... అధికార పార్టీకి  చెందినవారు ఈ పని చేసినా జైలుకెళ్లడం ఖాయమన్నారు.

ప్రభుత్వ పనితీరు, అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పథకాలు, సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలపై తన దగ్గర సర్వే ఉందని మంత్రులకు చెప్పారు. ఎక్కడైనా ఫలితాల విషయంలో తేడా వస్తే మంత్రులు వెంటనే రాజీనామా చేయాల్సిందేనని జగన్ హెచ్చరించారు. 

అలాగే సరయిన ఫలితాలను రాబట్టడంలో విఫలమైన ఎమ్యెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వబోనంటూ సీఎం సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 8 వరకూ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. ఈ నెల 9 నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని.... ఆలోపే పార్టీ పనులన్నీ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్ వైసిపి శ్రేణులకు సూచించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios