అమరావతి: ఈఎస్ఐ హాస్పిటల్స్ వైద్యం పేరిట భారీ  అవినీతి జరుగుతున్నట్లు ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఈ అవినీతి వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలో కలకలం రేపింది. దీంతో అసలు ఈఎస్ఐలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

కార్మికుల సంక్షేమం, వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై సంబంధిత అధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో జరుగుతున్న అవినీతిపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. మందులు కొనాల్సిన డబ్బులతో కాస్మొటిక్స్‌ కూడా కొన్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ అవినీతి వ్యవహారంపై సీరియస్ అయిన సీఎం ఇకపై ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అవినీతి ఉండకూడదని గట్టిగా హెచ్చరించారు. 

ఈ వ్యవస్థల్లో ఉన్న అవినీతిని ఏరిపారేయాలని... దీనివల్ల పేద కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కార్మికులకు అందించాల్సిన మందుల కొనుగోలులో పారదర్శకత ఉండాలని... కొనుగోలు చేసిన మందుల్లో జీఎంపీ ప్రమాణాలు ఉండాలన్నారు. ఈఎస్‌ఐ బిల్లులు కూడా ఎప్పటికప్పుడు విడుదలచేయాలని సీఎం అధికారులకు సూచించారు.

వైద్యసేవల్లో నాణ్యత కోసం ఇప్పటికే కొన్ని ప్రమాణాలు నిర్దేశించుకున్నట్లు... ఆ ప్రమాణాలు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఉండేలా చూడాలని జగన్ ఆదేశించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక టీచింగ్‌ ఆస్పత్రిని పెడుతున్నట్లు తెలిపారు. అలాగే నర్సింగ్‌ కాలేజీని కూడా పెడుతున్నామని అన్నారు. 

ఇప్పుడున్న టీచింగ్‌ ఆస్పత్రుల సంఖ్య 11 నుంచి 27కు పెంచుతున్నట్లు...పెద్ద సంఖ్యలో వైద్యులు ఈ కాలేజీల నుంచి వస్తారని అన్నారు. వీరి సేవలనుకూడా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో వినియోగించుకునేలా చూడాలన్నారు. 

వైద్య ఆరోగ్యశాఖతో అనుసంధానమై ఈఎస్‌ఐ ఆస్పత్రులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో సేవల మెరుగు కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. 

రాష్ట్రంలో కాలుష్య నివారణపైనా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని కాలుష్యం బారినుంచి కాపాడుకోవాలని...అలా చేస్తే రాష్ట్రానికి మేలు చేసినట్టేనని అన్నారు. సముద్రంలోకి విచ్చలవిడిగా వ్యర్థాలను వదిలేస్తున్నారని...దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరిగి భావితరాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొనే ప్రమాదం వుందన్నారు. కాలుష్య నివారణ ప్రమాణాలు డిస్‌ప్లే చేయాలని సూచించారు. కాలుష్యం వల్ల అందులో పనిచేసే కార్మికుల ఆరోగ్యానికీ ఇబ్బందులు వస్తాయన్నారు.

కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపైనా దృష్టిపెట్టాలని సూచించారు. ఎల్‌ఐసీ నుంచి బీమా చెల్లింపు నిలిచిపోయిందని...ఎన్నిసార్లు అడిగినా వారు స్పందించడంలేదని అధికారులు సీఎంకు ఫిర్యాదు చేశారు. బీమా రూపంలో ఎల్‌ఐసీ  బకాయిలు పడ్డ చెల్లింపు కోసం ప్రధాని మోదీకి లేఖ రాస్తామని సీఎం జగన్ వెల్లడించారు.