Asianet News TeluguAsianet News Telugu

నిరుపేదలకు జగన్ వరాలు... స్థలాలు, ఇళ్లే కాదు ఆర్థిక సాయం కూడా

హౌసింగ్‌ స్కీమ్ పై చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. పేదలకు ఇళ్లనిర్మాణానికి సంబంధించిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించిన ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. 

AP CM YS Jagan Review Meeting On Housing Scheme
Author
Amaravathi, First Published Mar 6, 2020, 6:28 PM IST

అమరావతి: ప్రతిపేదవాడికి సొంతింటికలను నిజం చేసే దిశగా ప్రభుత్వం బృహత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఉగాదిరోజున 26.6 లక్షల ఇళ్లపట్టాల పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం.. వచ్చే నాలుగేళ్లలో 30లక్షలకుపైగా ఇళ్లను నిర్మించడానికి కార్యాచరణను సిద్ధంచేసింది. రాష్ట్ర ప్రభుత్వ గృహనిర్మాణ రంగంలో కొత్త చరిత్రను సృష్టించడానికి వైయస్‌ జగన్‌ సర్కార్‌ సమాయత్తమైంది. 2024 నాటికి ఈ కలను సాకారం చేసేదిశగా అడుగులేస్తోంది.

హౌసింగ్‌ స్కీమ్ పై చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. పేదలకు ఇళ్లనిర్మాణానికి సంబంధించిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పుడిస్తున్న ఇళ్లపట్టాలు, నిర్మించాల్సిన ఇళ్లపై పూర్తిస్థాయిలో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రతిఏటా నిర్మించాల్సిన లక్ష్యాలపైనా చర్చించారు. పట్టణ, నగరాభివృద్ధి సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లనిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, వాటినుంచి ఇప్పటివరకూ మంజూరైన ఇళ్ల వివరాలను సీఎం అడిగితెలుసుకున్నారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా ఇంకా ఎన్ని ఇళ్లు రాష్ట్రానికి మంజూరు అవడానికి ఆస్కారం ఉందన్న అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేందుకు ఆస్కారం ఉన్న నిధులు, అదిపోనూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులు అవసరమన్న దానిపై చర్చించారు. మొత్తమ్మీదకు ఈ ఉగాది నాటికి 26.6 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వనున్నామని, వచ్చే నాలుగేళ్లలో 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 

ఇప్పుడు పట్టాలు పొందుతున్న పేదలతోపాటు, సొంతంగా ఇళ్లస్థలాలు ఉన్న పేదలకూ ఇళ్లు నిర్మిస్తామని, మున్సిపాల్టీలు, నగరాభివృద్ది సంస్థల పరిధిలోనే దాదాపు 19.3 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించడానికి ప్రణాళికలు వేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. గృహనిర్మాణ శాఖలో ఉన్న 4,500 మంది ఇంజినీర్లతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా నియామకం అయిన సిబ్బందిలో 45వేలమంది కూడా 30 లక్షల ఇళ్ల నిర్మాణ క్రతువులో భాగస్వాములు అవుతారని అధికారులు వెల్లడించారు. మొత్తంగా 45వేల మంది సిబ్బందితో ఈ మహాక్రతువును నిర్వహిస్తామని చెప్పారు. వీరందరికీ కూడా ఇళ్ల నిర్మాణంపై శిక్షణ ఇచ్చారు. 

ఇళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేలా చూడాలని జగన్‌ అధికారులను ఆదేశించారు. డిజైన్‌లో కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. నిర్మాణం అత్యంత నాణ్యంగా, అందంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఒక బెడ్‌రూం, కిచెన్, వరండా, టాయిలెట్‌ ఉండేలా డిజైన్‌ రూపొందించారు. 

ఇళ్లు కట్టిన తర్వాత ఆ ఇంటిపై రూ.25వేల రూపాయల వరకూ పావలావడ్డీకే రుణం ఇచ్చేలా బ్యాంకులతో ఏర్పాటు చేయాలని, మిగిలిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం అధికారులకు తెలిపారు. అత్యవసరాలకు ఈ డబ్బు పేదవాడికి చాలా మేలు చేస్తుందని, అధిక వడ్డీలకోసం ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండదని సీఎం అన్నారు. 

పేదలకు కడుతున్న కాలనీల్లో చెట్లు నాటాలని, డ్రైనేజీ ఏర్పాటుపైనా సరైన ప్రణాళిక అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కరెంటు, తాగునీటి వసతికూడా కల్పించాలన్నారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios