అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ వివిధ శాఖల ఉన్నతాధికారులతో అగ్రి మిషన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల కొనుగోలు బుకింగ్‌ చేసుకునే వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. 

పంట కొనుగోలు కేంద్రాల తీరు, రైతులకు లభిస్తున్న ధరల గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలు మరింత సమర్థవంతంగా నడవటానికి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన ధరల పట్టిక ఉంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రకటించిన ధరలకన్నా తక్కువకు రైతుల నుండి పంట కొనుగోలు చేస్తే వెంటనే ప్రభుత్వం జోక్యంచేసుకోవాలన్నారు. 

ఎక్కడ రైతు నష్టపోయినా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూచించారు. దీనికోసం సరైన మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైతులనుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలవద్ద సరిపడా సిబ్బందిని పెట్టాలని సూచించారు. 

read more  ప్రభుత్వంలో విలీనం...సంతోషం కంటే సమస్యలే ఎక్కువ: ఆర్టీసీ యూనియన్ ఆవేదన

ప్రస్తుతం శనగలు, కందులు మార్కెట్లోకి వస్తాయని.. కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు.పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరల రేట్లను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే కొనుగోలు కేంద్రాల వివరాలు కూడా గ్రామ సచివాలయాల్లో ఉంచాలన్నారు. వారానికోసారి ఖచ్చితంగా సమావేశం పెట్టుకుని రైతులకు అందుతున్న ధరలపై సమీక్ష చేయాలని...నాలుగు వారాలకోసారి తనతో సమావేశం వుంటుందన్నారు. 

ఇది ప్రాధాన్యతతో కూడుకున్న కార్యక్రమమని... అలసత్వం జరిగితే రైతుకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. రైతుల్లో చైతన్యం తీసుకుని రావాలని... కొనుగోలు కేంద్రాల్లో పంటను కొన్న తర్వాత డబ్బులు వెంటనే అందేలా చూడాలన్నారు. వచ్చే నెలకల్లా పరిస్థితిలో మొత్తం మార్పులు రావాలని ఆదేశించారు. లేదంటే సంబంధిత అధికారులను ఖచ్చితంగా బాధ్యుల్ని చేస్తానని సీఎం హెచ్చరించారు.

రైతుకు ఖచ్చితంగా కనీస మద్దతు ధరలు రావాలని... పంటను అమ్ముకునే సమయంలో రైతులకు చిన్న ఇబ్బంది కూడా రాకూడదని అన్నారు. ఈ కీలక అంశాలను అధికారులు సవాల్‌గా తీసుకుని పనిచేయాలని ఆదేశించారు. ఈక్రమంలో ఆర్థికంగా ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదన్నారు సీఎం జగన్. 

read more  వీఆర్ వివాదం... వర్ల రామయ్యపై పోలీస్ అధికారుల సంఘం ఫైర్

వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాలను ఓన్‌ చేసుకోవాలని జగన్ సూచించారు. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించాలని... పశుసంవర్థకం, హార్టీకల్చర్, ఫిషరీస్‌ రంగాలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొత్త ఊపు ఇవ్వాలన్నారు. విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు పక్కాగా ఉండాలని ఆదేశించారు. వీటి ధరలు తగ్గించి ఎరువులు, విత్తనాలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు సీఎం జగన్ తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె. కన్నబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్,  కొడాలి నాని, సీఎస్‌ నీలం సహానీ తదితరులు పాల్గొన్నారు.