అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై  పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందని... రాజధాని ఎక్కడ ఉంటే అన్నివిధాలుగా బావుంటుందో ఈ నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు.   

గత ప్రభుత్వం రాజధాని ఎక్కడ ఉండాలో మాజీ మంత్రి నారాయణ కమిటీ ద్వారా నిర్ణయించిందని బొత్స గుర్తుచేశారు. ఈ కమిటీపై సెటైర్లు వేస్తూనే రాజధాని గురించిన సంచలన విషయాలను ఆయన బయటపెట్టారు. 

‘‘నేను నారాయణ కాదు.. సత్యనారాయణను. నిపుణుల సూచన...ప్రజల క్షేమమే లక్ష్యంగా నిర్ణయాలుంటాయి. అలా రాష్ట్రానికి ఎంతో కీలకమైన రాజధాని విషయంలోనూ నిపుణుల కమిటీ నిర్ణయమే మా నిర్ణయం.'' అని బొత్స వెల్లడించారు. 

గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి రాజధానిపైనే కాకుండా ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడారు. ఇళ్ల పట్టాల పంపిణీకి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 20 లక్షల మందిని అర్హులుగా గుర్తించామన్నారు.  గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా అర్హులైన వారిని ఇంకా గుర్తించి లబ్ధిదారుల కిందకు చేరుస్తామని తెలిపారు.

వేట నిషేధం రుసుము 4వేలనుండి పదివేలకు పెంపు సర్వత్రా హర్షం (వీడియో)...

పట్టణ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలా కాకుండా అవకాశం ఉన్నంత మేరకు వ్యక్తిగత నివాసాలను నిర్మించి ఇస్తామని బొత్స స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ఉగాది నాటికి అర్హులైన వారందరికీ పట్టాలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ఇళ్ల నిర్మాణానికి భూసేకరణతో పాటు అవసరమైన మేరకు భూమిని కొనుగోలు చేస్తామని బొత్స వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్లకు మరమ్మత్తులు చేస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

గత ప్రభుత్వం నిర్మించి, నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఇళ్లు లేని వారి ఇబ్బందులను ప్రత్యక్షంగా గమనించారని అందువల్ల గృహ నిర్మాణ పథకంపై దృష్టిసారించామన్నారు.

నిరుద్యోగులకు జగన్ గుడ్ న్యూస్: ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూ రద్దు ...

ధనవంతులే కాకుండా పేదవారు సైతం బంగ్లాలో ఉండాలనేది ముఖ్యమంత్రి కల అని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ అర్హుల వద్ద నుంచి నయా పైసా కూడా వసూలు చేయమని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ పట్ణణ గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ల్లోనూ రివర్స్ టెండరింగ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.5వేల కోట్ల పనులను ఏపీ టిడ్కో చేపట్టింది ఇందుకు సంబంధించి వివిధ స్థాయిల్లో టిడ్కో ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటి వరకు 25 శాతం కూడా పూర్తి కాని ప్రాజెక్ట్‌ల రివర్స్ టెండరింగ్‌కు ఈ నిర్ణయం వల్ల వీలు కలుగుతుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖరారు చేశారు.