అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని  మార్పుకు సంబంధించిన బిల్లుపై శాసనమండలిలో చర్చ సందర్భంగా గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మంత్రులు, వైసిపి ఎమ్మెల్సీలు, టిడిపి నాయకులు దీనిపై వాడివేడిగా చర్చించడమే కాదు ఓ దశలో ఇరుపార్టీల సభ్యులు బాహాబాహీకి కూడా సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సమయంలో మండలి  సమావేశాల లైవ్ ను నిలిపివేయడంతో సభతో ఏం జరిగిందో బయటి ప్రపంచానికి తెలియలేదు. మండలిలో జరిగిన పరిణామాలపై తాజాగా టిడీపీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, సత్యనారాయణ రాజులు వివరించారు.

ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలని... కానీ వైసిపి ప్రభుత్వం వాటిని అతిక్రమించిందన్నారు. మండలిలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకూడదనే  ప్రసారాలు నిలిపేశారని అత్యంత దారుణంగా వ్యవహరించిందన్నారు. ముఖ్యంగా కొందరు మంత్రులు మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ ను బెదిరిస్తూ తీవ్ర ఒత్తిడి చేస్తూ నరకం చూపించారని... అయితే వాటికి తలొగ్గకుండా ఛైర్మన్  గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. 

మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడుచుకోవాలని... గతంలో తాము అధికారంలో వుండగా అలాగే చేశామన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఘోరంగా వ్యవహరిస్తోందని... ఏకంగా శాసన మండలి  ఛైర్మన్ నే మంత్రులు బెదిరిస్తూ రాజ్యాంగ విలువలను కాలరాశారన్నారు. చైర్మన్ చేతిలోని కాగితాలను లాక్కుని కొందరు మంత్రులు చించేశారని నానా రభస సృష్టించారని అన్నారు.

read more  మండలి ఛైర్మన్ అనుచిత వ్యాఖ్యలు...మంత్రులపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు

మండలి చైర్మన్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించారని... రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని మంత్రి బొత్స మాట్లాడటం సరికాదన్నారు. కౌన్సిల్ కు బిల్లును తిరస్కరించే పూర్తి అధికారం ఉందని... ఆ విషయం మంత్రులకు తెలీదా?అని ప్రశ్నించారు. హడావుడిగా బిల్లును ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. 

తమ బిల్లును రిజక్ట్ చేయమని అధికార పార్టీ నేతలు కోరడం విడ్డూరంగా వుందన్నారు. అధికార పార్టీ సభ్యులే శాసనమండలిలో గందరగోళం సృష్టించారని... వెల్ లోకి దూసుకెళ్లి ఛైర్మన్ తో దురుసుగా మాట్లాడటం ఏంటని నిలదీశారు. మంత్రులు నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 

మండలి రచ్చ: పోడియం పైకెక్కిన కొడాలి నాని (ఫోటోలు)

మండలిలో బుధవారి అధికార పార్టీ నేతలు వాడిన భాష, చేసిన దాడులు వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అయినా బెయిల్ మీద ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డికి కౌన్సిల్ లో ఏం పని? అంటూ టిడిపి ఎమ్మెల్సీలు ప్రశ్నించారు.