గుంటూరు: అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలపై ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రశ్నించినందుకు తమ నాయకుడు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. 

బస్సు యాత్రను ప్రారంభించడానికి వెళ్ళిన టిడిపి నాయకులను  అక్రమంగా అరెస్టు చేసి గందరగోళం సృష్టించిన జగన్మోహన రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నానని యనమన వెల్లడించారు.జగన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలకు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.             

ఈ సందర్బంగా యనమల మాట్లాడుతూ...దేశంలో అతిపెద్ద రాష్ట్రమయిన ఉత్తర ప్రదేశ్ లో 70 జిల్లాలు ఉన్నా రాజధాని మాత్రం ఒకటే ఉందన్నారు. కానీ 13 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ కు 3 రాజధానులు కావాలా? అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఇటువంటి తుగ్లక్ చర్యలకు పాల్పడటం రాష్ట్రానికి శ్రేయస్కరం కాదన్నారు.

read more  మహిళల్ని అర్థరాత్రి జైలుకు తరలించి...: పోలీస్ ఆగడాలపై కళా వెంకట్రావు సీరియస్

వైసీపీ నేతలు విశాఖలో కబ్జా చేసిన భూముల ద్వారా భారీ స్థాయిలో లబ్ది పొందడానికే రాజధానిని అక్కడకు తరలిస్తున్నారని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మానానికి విలువలేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని తుంగలో తొక్కి ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీశారని అన్నారు. 

ఐదుకోట్ల ఆంధ్రుల కోసం స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూములు ఇచ్చి రైతులను అవహేళన చేయడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వానికి ఇక్కడ ఇంత ల్యాండ్ బ్యాంకు ఉంచుకొని రాజధానిని విశాఖకు తరలించవలసిన అవసరం ఏమిటని నిలదీశారు. కేవలం వైసిపి నాయకుల భూముల కోసం తప్ప ఇది ప్రజల కోసం నిర్ణయం కాదని తేలిపోయిందన్నారు.

ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, రైతులు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. రాజధాని తరలిస్తున్నారన్న మనోవేధనకు గురై 29 గ్రామాలలో ఇప్పటివరకు 10 మంది గుండె ఆగి మరణించినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదన్నారు. 

read more  దృష్టి మరల్చడానికే చంద్రబాబు హంగామా... విజయవాడ ఘటన ఆయన స్క్రిప్టే: హోంమంత్రి సుచరిత

ప్రజా ఆందోళలను పట్టించుకోకపోవడం అప్రజాస్వామికం, అమానుషమన్నారు. ప్రజా ఉద్యమాన్ని అణచాలని చూడటం నిరంకుశత్వమే అవుతుందని మాజీ మంత్రి యనమల ఆరోపించారు.