''అమరావతే తమ రాజధాని అంటున్న విశాఖవాసులు... కారణమిదే...''
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలంటూ ఆ ప్రాంత రైతులు ఏపి బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను వేడుకున్నారు.
గుంటూరు: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత రెండు కార్పోరేట్ కంపనీల చేతుల్లో నవ్యాంద్ర ప్రజలు నలిగిపోతున్నారని ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టి, ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వ విధానాలతో గత 50 రోజులుగా రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని... అవినీతి తప్ప ఈ ప్రభుత్వానికి వేరే ఆలోచనే లేదని మండిపడ్డారు.
రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు రైతులు కన్నా లక్ష్మీనారాయణను కలిసి తమ గోడును వివరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎలాగయినా వైసిపి ప్రభుత్వ రాజధాని తరలింపు నిర్ణయాన్ని అడ్డుకోవాలని వేడుకున్నారు.
read more ఏపి కేబినెట్ సమావేశం... కీలక నిర్ణయాలివే
ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ... అమరావతి నుండి రాజధానిని ఎవరు మార్చమన్నారని మారుస్తున్నారు..? అని ప్రశ్నించారు. విశాఖకు రాజధానిని తరలించడంపై ఉత్తరాంధ్ర ప్రజలెవ్వరూ సానుకూలంగా లేరని అన్నారు. ఉత్తరాంధ్రలో కూడా అమరావతి రాజధాని కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారని... తమ ప్రాంతానికి రాజధాని వస్తే సమస్యలు వస్తాయని అక్కడి ప్రజలు భయంతో ఉన్నారని అన్నారు.
రాజధాని అనేది కేవలం అమరావతి పరిధిలోని 29 గ్రామాల సమస్య కాదు... రాష్ట్ర అభివృద్ధికీ సంబంధించిన విషయమని అన్నారు. గత సీఎం ఇక్కడి రైతుల భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావించారని... ఇప్పటి సీఎం ఇక్కడ దోచుకోడానికి ఏం లేదని విశాఖ వెళ్తున్నారని ఆరోపించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ చార్జీలు,పెట్రో ఛార్జీలు పెంచారని గుర్తుచేశారు. ఇలా సామాన్యులు రోజూ ఉపయోగించే వాటి ధరలు పెంచి వారి రక్తం పీల్చేలా పాలన సాగుతోందని మండిపడ్డారు.
read more ఆ ఛాలెంజ్ ఓకే... ఇప్పుడు బుద్దా ఛాలెంజ్ కు సిద్దమా...: జగన్ కు ఎమ్మెల్సీ సవాల్
ఏపి రాజధాని అమరావతిలోనే ఉండేలా తాము పోరాడతామన్నారు. ఇక్కడి నుండి రాజధానికి మరెక్కడికి తరలించినా పోరాటం ఉదృతం చేస్తామన్నారు. ఈ విషయంలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తామన్నారు.
కన్నా లక్ష్మీనారాయణను కలిసిన రైతుల్లో కొమ్మినేని సత్యనారాయణ, లంకా సుధాకర్, ఆవుల వెంకటేశ్వరరావు, మార్త నరేంద్రబాబు, గౌర్నేని స్వరాజ్య రావు, కొమ్మినేని శివయ్య, కారుమంచి నరేంద్ర, కంతేటి బ్రహ్మయ్య, పువ్వాడ సురేంద్రబాబు, కుప్పాల సుబ్బారావు తదితరులు ఉన్నారు.