Asianet News TeluguAsianet News Telugu

బాలికపై లైంగిక వేధింపులు... నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు

 రాష్ట్రంలో ప్రతి రెండు రోజులకు ఒక బాలల లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయన్నాయని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. 2012లో ఫోక్సో చట్టం వచ్చినా నేరాల ప్రవృత్తి పెరిగిపోయిందని... చట్టాలను చుట్టాలుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు బయటికి వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

''Protection of children from sexual offences Act - 2012'' review meeting at amaravathi
Author
Amaravathi, First Published Nov 27, 2019, 9:31 PM IST

అమరావతి: బాలలపై రోజురోజుకూ పెరిగిపోతున్న లైంగిక వేధింపులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. సచివాలయంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ‘లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం-2012’ అనే అంశంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.దమయంతి అధ్యక్షత వహించారు. 

సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే. రోజా తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న వేధింపులతో పాటు పలు అంశాలపై చర్చించారు.  

ఈ సందర్భంగా పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.... చిన్నపిల్లల్ని మనం దైవంతో సమానంగా చూసుకుంటా మని...అలాంటిది వీరిపై వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో అలాంటి ఆలోచన వచ్చిందంటే వారిలోని మానసిక, శారీరక సమస్యల వల్లే ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారన్నారు. 

ఫోక్సో చట్టంపై ప్రజల్లో అవగాహన లేకపోవడం వలన పదే పదే నేరగాళ్లు లైంగికదాడులకు పాల్పడుతున్నారన్నారు. పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖకు ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను మంత్రి గుర్తుచేశారు. దాడులకు గురైన వారిని ఇష్టారాజ్యంగా ప్రశ్నించడం, ఇబ్బందులకు గురిచేయకుండా ఫ్రెండ్లీ పోలీసు విధానాలను కొనసాగించాలని కోరారు.

read more  అమరావతిలో చంద్రబాబు పర్యటన... రూట్ మ్యాప్ ఇదే

 దాడులు జరిగిన తర్వాత తీసుకునే చర్యల కన్నా దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 15 యేళ్లు వయసు దాటిన బాలబాలికలకు తల్లిదండ్రులు లైంగికాంశాలపై తరచూ చర్చిస్తూ అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. పిల్లల జీవన విధానాన్ని ఎప్పటికప్పుడు గమనించి వారిలో మార్పులు తీసుకురావాలన్నారు. 

మహిళలపై జరుగుతున్న అన్ని రకాల దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బాలబాలికలకు విద్యార్థి దశ నుంచే విడివిడిగా ఉపాధ్యాయులతో లైంగిక అంశాలకు సంబంధించి అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.  

ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే.రోజా మాట్లాడుతూ... ఎక్కడ చూసినా బాలలపై నేరాలు,ఘోరాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో ఈ నేరాల సంఖ్య ప్రమాదకరస్థాయికి చేరాయన్నారు. ఎన్ని చట్టాలున్నా బాలలపై దాడులను నియంత్రించలేకపోతున్నామని, పోలీసులతో వారి పనిని చేయిస్తే నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. 

రాజకీయ సిఫార్సులకు తావివ్వకుండా బాలల సంరక్షణ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అంగన్ వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, డ్వాక్రా గ్రూపుల ద్వారా లైంగిక అంశాలకు సంబంధించిన అవగాహన కల్పించాలని కోరారు. మహిళా పోలీసు స్టేషన్లు విరివిగా ఏర్పాటు చేయడం అందులో ఫ్రెండ్లీ విధానాలు ఏర్పాటు చేసేలా చూడాలని హోంమంత్రిని ఆర్కే రోజా కోరారు. 

ప్రస్తుత ప్రభుత్వం పోలీసు శాఖలో 40 శాతం మహిళలను తీసుకోవడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో దీనిపై ప్రత్యేకదృష్టి సారించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్‌కుమార్‌ను కోరారు. యూనిసెఫ్ ప్రతినిధులు  ఛైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ సోనీ కుట్టి జార్జ్, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ నేషనల్ లా స్కూల్ అనురూప గిలియాల్, యునిసెఫ్ సీనియర్ కన్సల్టెంట్ పి.డేవిడ్ లు  ‘బాలల రక్షణ చట్టం-2012 –లైంగిక నేరాల నియంత్రణ’ అంశంపై క్షేత్రస్థాయిలో సేకరించిన పలు వివరాలను తెలియజేశారు. 

read more  నైపుణ్యాభివృద్ధి లో దేశంలోనే ఏపి నెంబర్‌వన్... జర్మన్ ప్రతినిధులతో మంత్రి మేకపాటి

కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, రంపచోడవరం ఎమ్మెల్యే  నాగులపల్లి ధనలక్ష్మీ,  ప్రిన్సిపల్ సెక్రటరీ కె.దమయంతి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.కిషోర్ కుమార్, కమిషనర్ కృత్తికా శుక్లా, సీఐడీ పోలీస్ డిపార్ట్ మెంట్ సరిత, సెఫ్టీ అండ్ సెక్యూరిటీ గర్ల్ చిల్ర్రన్ సంస్థ ప్రతినిధి ఎన్ ఫోల్డ్ కో ఫౌండర్, గైనకాలజిస్ట్ డా. సహైభ్యా సల్దానా, తదితరులు పాల్గొన్నారు.  

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతి రెండు రోజులకు ఒక బాలల లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయన్నారు. 2012లో ఫోక్సో చట్టం వచ్చినా నేరాల ప్రవృత్తి పెరిగిపోయిందన్నారు. చట్టాలను చుట్టాలుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు బయటికి వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సమర్థవంతమైన చట్టాలున్నా నేరాలు నిర్భయంగా చేస్తున్నారంటే శిక్షలో జాప్యం కారణంగా వీరి సంఖ్య పెరుగుతోందన్నారు. సమాజంలో సామాజిక మాధ్యమాలు, సినిమాలు, సీరియళ్లలో వస్తున్న నేరచరిత కార్యకలాపాలు అధికంగా ప్రభావం చూపుతున్నాయన్నారు. నేరాలను తగ్గించాలంటే ఒక్కశాఖనే బాధ్యత  తీసుకోకుండా అందరూ కలిసి సమర్థవంతంగా పని చేయాలన్నారు. 

గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లతో ప్రతి 50 కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విధానంతో పాటు ఇటువంటి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్రంలో 9 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని, తద్వారా నేరస్థులకు త్వరితగతిన శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ఫ‌లితంగా రాష్రంలో ఇలాంటి ఘటనలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. 
                   
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ... బాలలపై రకరకాల వేధింపులు పెరిగి రక్షణ, భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో దేశంలో, రాష్ట్రంలో చిన్నారులపై జరుగుతున్న వేధింపులు, దోపిడీలను చూస్తుంటే వారి సంరక్షణ ఏ విధంగా ఉంటుందనే ఆందోళనలో ప్రజలున్నారని అన్నారు. 

బాలలపై జరుగుతున్న వేధింపులను పరిశీలిస్తే 80 నుండి 90 శాతం కేసుల్లో నిందితులు, కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులే ఉండటం బాధ కలిగించే అంశం అన్నారు. నిందితుల వయస్సు, స్వభావం పరిశీలిస్తే ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. 60 యేళ్ల పైబడిన వృద్ధులు, తమ మనవరాళ్ల వయసు ఉండే పదేళ్లలోపు ఆడపిల్లలను  లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులు నమోదు అవుతున్నాయన్నారు. 

13,14 సంవత్సరాల వయస్సున్న బాలురు తమ కింది తరగతి చదువుతున్న బాలికలను లైంగికంగా వేధించడం కలత చెందే విషయమన్నారు. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో యాజమాన్యాలు, సిబ్బంది అక్కడి మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడటం దారుణమైన విషయమన్నారు. దీనిపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ, హోంశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, యూనిసెఫ్ ప్రతినిధుల బృందం, ఆయా శాఖల రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి అభిప్రాయలను వెల్లడించాలని మంత్రి తానేటి వనిత కోరారు. 

''Protection of children from sexual offences Act - 2012'' review meeting at amaravathi

బాలికలు, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల వలన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. చట్టాలపై అవగాహన చేసుకోవడం ద్వారా కొంతమేర ప్రజల్లో అవగాహన రావాలని మంత్రి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాడులకు పాల్పడుతున్న నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషి చేస్తుందని, ఆ మేరకే పథకాలను రూపొందించడం జరిగిందన్నారు. 

రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు అగ్రస్థానం కల్పించారని గుర్తుచేశారు. బాలలపై దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కఠిన శిక్షలను త్వరితగతిన అమలు చేయాలని కోరారు. తప్పులు చేసిన వారు భయపడేలా ఆ శిక్షలు ఉండాలన్నారు.  శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు ,అనంతపురం జిల్లాల్లో బాల్య వివాహాలు తరుచూ జరుగుతున్నాయన్నారు. 

బాలల అక్రమ రవాణా, జోగినీ వ్యవస్థలు ప్రత్యక్షంగా చూడటం జరిగిందన్నారు. మడకశిర నియోజకవర్గంలో ఒక ఊరును సందర్శించిన సమయంలో ఆచార వ్యవహారాలను అడ్డుపెట్టుకొని బాలికలు, యువతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశానని మంత్రి వివరించారు. 

ఆడపిల్ల రజస్వల అయితే బుట్టలో పెట్టి 9 రోజులు ఎండలో ఉంచడం వారికి సరైన పౌష్టికాహారం ఇవ్వకుండా పండగలు నిర్వహించడం వంటి పాతతరం సంస్కృతీ సంప్రదాయాలను గమనించి చలించిపోయానన్నారు. కనీసం పీరియడ్స్ వచ్చిన సమయంలో బాలికలను, మహిళలను ఊరిబయటకు తీసుకెళ్లి విద్యుత్ లేని చోట ఉంచడం అక్కడి దురాగతాలకు అద్దం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల సహాయంతో వారిలో అవగాహన కల్పించి మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. లైంగిక దాడులకు సంబంధించి జరుగుతున్న అవమానాలను కేవలం బాలికలకే కాకుండా బాలురకు కూడా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. 
                                 

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.... చిన్నపిల్లలపై వరుసగా జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో రాష్ర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమగ్ర చర్యలను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తల్లిదండ్రుల్లో ఆందోళనను తొలగించేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫోక్సో చట్టంలో ఉన్న శిక్షలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios