తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జూనియర్ పంచాయితీ కార్యదర్శుల నియామక ప్రక్రియపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస నిబంధనలు కూడా పాటించకుండా నియామక ప్రక్రియను ఎలా చేపడుతున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ ఆదేశాలు లేనిదే నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకూడదంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున చేపట్టిన జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ నియామక ప్రక్రియలో సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పాటించే నిబంధనలను ప్రభుత్వం పాటించలేదు. ముఖ్యంగా స్పోర్ట్స్‌, వికలాంగుల కోటాని విస్మరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ అంశంపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా ఇవాళ విచారణ జరిగింది. 

ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.  స్పోర్ట్స్‌, వికలాంగుల కోటాను ఎలా విస్మరిస్తారంటూ ప్రశ్నించింది. వారి వాటా సరి చేసిన తర్వాతే మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అలాగే ఈ నియామకాల కోసం జరిగిన పరీక్షలో ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులపై కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ అనుమతి లేకుండా  అభ్యర్ధులకు నియామక పత్రాలు అందించవద్దని సూచిస్తూ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.