ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగ యువతకు ఏపిపిఎస్సి (ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్) శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఖాళీగా వున్న దాదాపు 1051 పంచాయితీ కార్యదర్శి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాకుండా మహిళా శిశు సంక్షమ శాఖలో 109 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా ఏపిపిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పంచాయితీ కార్యదర్శి ఉద్యోగాల నియామక ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఏపిపిఎస్సి అధికారులు విడుదల చేశారు. ఈ ఉద్యోగార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ డిసెంబర్ 27 నుండి జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు మొదట ప్రిలిమినరీ పరీక్షను ఏప్రిల్ 21, ప్రధాన పరీక్షను ఆగస్టు 2న నిర్వహించనున్నట్లు ఏపిపిఎస్సి వెల్లడించింది.   

ఈ ఉద్యోగాలను జిల్లాల వారిగా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రకాశం 172, చిత్తూరు 141, విజయనగరం 125, శ్రీకాకుళం 114, విశాఖపట్నం  107, తూర్పు గోదావరి 104, కర్నూలు 90,నెల్లూరు 63, గుంటూరు 50, అనంతపురం 41, పశ్చిమ గోదావరి 25, కృష్ణా జిల్లా 22, కడపలో 2 పంచాయితీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయనున్నారు. 

మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు ఈ నెల 28 నుండి జనవరి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏపిపిఎస్సి సూచించిన అర్హతలు గల అభ్యర్ధులకు ప్రిలిమినరీ,, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక చేయనున్నారు.