Ilayaraja :రాజ్యసభకు ఇళయరాజా?నిజమెంత

ఇళయరాజా దళితుడు కావడం, ఆయన తండ్రి ప్రముఖ కమ్యూనిస్టు ప్లాట్‌ఫార్మ్ గాయకునిగా పని చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. అలాగే అంబేడ్కర్, నరేంద్ర మోదీ మధ్య ఉన్న అద్భుతమైన సారూప్యతలను కూడా ఈ పుస్తకం వెల్లడించింది.

Ilayaraja Will Become Rajya Sabha MP on Behalf of the BJP


ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారుడు, భారతీయ సినీ సంగీత దర్శకుడు మెస్ట్రో ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. రాజాను నేరుగా పార్టీలోకి చేర్చుకోకుండా రాజ్యసభకు పంపడం ద్వారా ఆయన అభిమానుల ఆదరణ పొందొచ్చనేది బీజేపీ వ్యూహంగా చెప్తున్నారు.

రీసెంట్ గా ‘అంబేడ్కర్ అండ్ మోడీ – రిఫార్మర్స్ ఐడియాస్ అండ్ పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్’ అనే పుస్తకాన్ని ఇంగ్లిష్ భాషలో బ్లూక్రాఫ్ట్ పబ్లికేషన్స్  ప్రచురించింది. ఈ పుస్తకంలో ఇళయరాజా ముందుమాట రాసారు. అయితే అదే సమయంలో  ఈ ముందుమాటలో డాక్టర్ అంబేడ్కర్‌ను ప్రధాని నరేంద్ర మోదీతో పోలుస్తూ ఇళయరాజా చేసిన వ్యాఖ్యలు  సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇళయరాజా దళితుడు కావడం, ఆయన తండ్రి ప్రముఖ కమ్యూనిస్టు ప్లాట్‌ఫార్మ్ గాయకునిగా పని చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. అలాగే అంబేడ్కర్, నరేంద్ర మోదీ మధ్య ఉన్న అద్భుతమైన సారూప్యతలను కూడా ఈ పుస్తకం వెల్లడించింది.

 ”సమాజంలో అణగారిన వ్యక్తులు ఎదుర్కొంటోన్న సవాళ్లను ఈ ఇద్దరూ అధిగమించారు. పేదరికం, అణచివేతతో కూడిన సామాజిక వ్యవస్థ స్థితిగతుల్ని వీరిద్దరూ నిశితంగా గమనించి వాటిని అణిచివేసేందుకు కృషి చేశారు. భారత్ గురించి వీరిద్దరికీ పెద్ద కలలు ఉన్నాయి. ఇద్దరూ ప్రాక్టికల్‌గా ఆలోచించేవారే” అని ముందుమాటలో ఇళయరాజా  రాసుకొచ్చారు. వర్ణవ్యవస్థలో అణిచివేతకుగురైన దళితల అభ్యున్నతి కోసం అంబేడ్కర్‌ పనిచేస్తే.. మోదీ మనుధర్మ వ్యవస్థకు చెందినవారని.. ఇద్దరిని పోల్చడమేంటంటూ ఇళయరాజాపై ఎంపీ టీకేఎస్‌ ఎలంగొవాన్‌ ఆగ్రహించారు. అయితే బీజేపీ మాత్రం ఇళయరాజాను వెనుకేసుకొచ్చింది.

 ఇదే స‌మ‌యంలో  మీడియాలో మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ‘మేస్ట్రో’ ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్‌ చేసేందుకు రంగం సిద్ధమైందని ఆ ప్ర‌చారం సారాంశం. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్ధిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేసే విషయం తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన 12 మందిని ఆయన రాజ్యసభ సభ్యులుగా నియమిస్తారు. ఆ కోటాలనే ఆరేళ్ల కిందట మోడీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని ఎగువ సభకు పంపింది. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఇప్పుడు ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నియమించనున్నారని  సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే కేంద్రంగానీ, రాష్ట్రపతి కార్యాలయంగానీ ఇప్పటిదాకా అధికారిక ప్రకటనైతే చేయలేదు. ప్రధాని మోదీని బాహాటంగా పొడిగిన కొద్ది రోజులకే ఇళయరాజాకు ఈ ఆఫర్ రావడం గమనార్హం. ఆయన ఇటీవల మోడీని అంబేడ్కర్‌తో పోల్చడంపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. వారిపై బీజేపీ సీనియర్‌ నేతలు రాధాకృష్ణన్‌, హెచ్‌ రాజా తదితరులు విరుచుకుపడ్డారు.

 తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా ఇళయరాజాకు మద్దతిచ్చారు. మోడీపై ప్రశంసలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటిని విమర్శించడం తగదన్నారు. ఈ నేపథ్యంలో ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా నియమించనున్నారన్న వార్త చర్చనీయాంశంగా మారింది. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌నేది నిర్ధార‌ణ కావాల్సి ఉంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios