లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా యాక్షన్ చిత్రాల దర్శకుడు గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన  సినిమా రాఘవన్‌. తమిళ్ తో పాటు తెలుగులోనూ సూపర్‌ హిట్ అయిన ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కమల్‌ రాజకీయాలతో బిజీగా ఉండటం, గౌతమ్‌ ఇతర ప్రాజెక్ట్ లతో పాటు ఆర్థిక సమస్యలతో ఇబ్బందుల్లో పడటంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది.

అయితే ప్రస్తుతం పరిస్ధితులు కాస్త అనుకూలించటంతో రాఘవన్‌ సీక్వెల్ మరోసారి తెర మీదకు వచ్చింది. గౌతమ్ మీనన్‌ మరోసారి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కమల్‌ కు జోడిని వెతికే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో కమల్‌ జోడిగా అనుష్కను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. 2006లో రిలీజ్‌ అయిన రాఘవన్‌ సూపర్‌ హిట్ కావటంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో అనుష్క ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గౌతమ్ మీనన్‌ సినిమాలో నటించే అవకాశం పై స్పందించింది.

ఏం మాయ చేసేవే సినిమాకు సీక్వెల్ ప్రస్థావన వచ్చినప్పుడు అనుష్క ఆసక్తికరంగా స్పందించింది. గౌతమ్‌ మీనన్ సినిమాలో నటించే అవకాశం వస్తే కాల్షీట్స్‌ తో సంబందం లేకుండా నటిస్తానని చెప్పింది. అంతేకాదు అజిత్ హీరోగా గౌతమ్ మీనన్‌ దర్శతక్వంలో తెరకెక్కిన `ఎంతవాడు గానీ` సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో అభిమానుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి.