కాఫీ పౌడర్ ను ఇలా వాడితే ముఖంపై మచ్చలు పోయి అందంగా కనిపిస్తారు
చాలా మంది కాఫీని చాలా ఇష్టంగా తాగుతుంటారు. అయితే కాఫీ పౌడర్ ను మన ముఖానికి కూడా ఉపయోగించొచ్చు, అవును దీన్ని ఉపయోగించి మనం ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు.

కాఫీ ఫేస్ ప్యాక్
మన దేశంలో చాలా మంది ఉదయాన్నే టీ, కాఫీలను తాగుతుంటారు. ఇవి మన నిద్రమబ్బును పోగొట్టడమే కాకుండా.. మనస్సును రీఫ్రెష్ చేస్తాయి. కాఫీ తాగితే మనకు మంచి ఎనర్జీ వస్తుంది. ఇది మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మన చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
కాఫీ ఫేస్ ప్యాక్
మన చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు కాఫీ పౌడర్ లో ఉంటాయి. కాఫీని డైరెక్ట్ గా చర్మానికి అప్లై చేస్తే మీ స్కిన్ యవ్వనంగా మారుతుంది. అలాగే అందంగా మెరిసిపోతుంది. దీన్ని పేస్ట్ గా, స్క్రబ్ గా లేదా మాస్క్ గా ఉపయోగించొచ్చు.
కాఫీలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని రక్షిస్తాయి. అసలు కాఫీ వల్ల మన చర్మానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ముఖానికి కాఫీ అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
యాంటీ ఏజింగ్ లక్షణాలు
కాఫీని నేరుగా మన ముఖానికి అప్లై చేయడం వల్ల ముడతలు, సన్నని గీతలు ఎండ వల్ల అయిన మచ్చలు, ఎరుపు వంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఇది మన చర్మాన్ని టైట్ గా చేసి యవ్వనంగా కనిపించేలా చేయడానికి సహాయపడుతుంది.
మొటిమలు తగ్గుతాయి
కాఫీ పౌడర్ ను ఉపయోగించడం వల్ల మీరు మొటిమల సమస్య నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. అలాగే చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి రెగ్యులర్ గా దీన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇందుకు సహాయపడతాయి.
చర్మం లోపలి నుంచి శుభ్రం
కాఫీని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం లోపలి నుంచి క్లీన్ అవుతుంది. ఇది మన చర్మాన్ని క్లియర్ గా ఉంచుతుంది. అలాగే చనిపోయిన కణాలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. కాఫీలోని కెఫిన్ కంటెంట్ రక్తప్రసరణను పెంచి స్కిన్ కు మంచి గ్లో తెస్తుంది. అంతేకాదు దీన్ని ఉపయోగించడం వల్ల డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి.
కాఫీని ముఖానికి ఇలా ఉపయోగించండి
కాఫీ, తేనె ఫేస్ మాస్క్
టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ లో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపండి. దీన్ని ముఖానికి సున్నితంగా అప్లై చేయండి. కాసేపు మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో కడిగేయండి. ఈ ఫేస్ మాస్క్ వల్ల ముఖంపై ముడతలు, నల్ల మచ్చలు పోతాయి. అలాగే ముఖం తేమగా ఉంటుంది.
కాఫీ, పాల ఫేస్ మాస్క్
ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పాలను కలపండి. ఈ పేస్ట్ ను 15 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి.ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై ఉన్న మురికిని తొలగించి కాంతివంతంగా చేస్తుంది.
కాఫీ, నిమ్మకాయ ఫేస్ ప్యాక్
ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని వెంటనే అందంగా చేస్తుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికే కాదు మెడకు కూడా అప్లై చేయొచ్చు. ఈ ప్యాక్ ను 15 నిమిషాల తర్వాత చల్లనీళ్లతో కడిగేయండి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
కాఫీని ఎట్టిపరిస్థితిలో కళ్ల చుట్టూ రాయకూడదు. అలాగే అలెర్జీ ఉన్నవారు కాఫీని యూజ్ చేయకూడదు. మీ స్కిన్ సున్నితంగా ఉంటే మాత్రం ప్యాచ్ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి.