Toll Fee: కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్.. ఇకపై ప్రతిసారి టోల్ ఫీజు కట్టనక్కర్లేదు
జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఏడాదిపాటు ఎన్నిసార్లు అయినా తిరిగే టోల్ పాస్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంతకీ ఈ పాస్ ఏంటీ? ఎలా తీసుకోవాలి? ఇతర విషయాలు మీకోసం.

జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించే ప్రైవేటు కార్ల ఓనర్లకు టోల్ బాదుడు నుంచి ఉపశమనం లభించనుంది. హైవేలపై టోల్ గేటు ఫీజు తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించే వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఆదా కానుంది.
రూ.3 వేలు కడితే?
రూ.3 వేలు చెల్లించి ఏడాది పాటు జాతీయ రహదారులపై ఎన్నిసార్లయినా ప్రయాణించేలా ‘టోల్ పాస్’ను అందుబాటులోకి తేవాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. అలాగే.. రూ.30 వేలు చెల్లిస్తే 15 ఏళ్ల పాటు హైవేలపై అపరిమితంగా ప్రయాణం చేసే వీలు కల్పించనుంది. ప్రయాణీకులు ఈ పాస్‌లను ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవి ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థతో అనుసంధానం చేయబడతాయి.
ప్రస్తుతం ఇలా
ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలలో నెలవారీ పాస్‌లు జారీ చేస్తున్నారు. నెలకు రూ. 340 చెల్లించాలి. అంటే ఏడాదికి రూ. 4,080 ఖర్చు అవుతుంది. 2023-24లో మొత్తం టోల్ ఆదాయం రూ. 55,000 కోట్లు. దీనిలో ప్రైవేట్ కార్ల వాటా రూ. 8,000 కోట్లు. కొత్త పథకం అమలులోకి వస్తే, జాతీయ రహదారుల అథారిటీ కొంత ఆదాయాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.
వాహనదారులకు ఉపశమనం
వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు ప్రైవేట్ కార్లకు కిలోమీటరుకు ప్రాథమిక టోల్ రేటును మార్చే అవకాశాన్ని మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఒకే టోల్ ప్లాజాకి నెలవారీ పాస్‌లు తీసుకునే వెసులుబాటు ఉంది.