డబ్బులు లేకున్నా.. ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు తెలుసా?
డబ్బులు లేకుండానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా? నిజమేనండి. ప్రయాణికుల సౌకర్యం కోసం IRCTC ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మరీ టికెట్ డబ్బులు ఎప్పుడు కట్టాలి? తర్వాత కడితే ఏమైన ఎక్కువ తీసుకుంటారా? ఇలాంటి విషయాలు ఇప్పుడు మీకోసం.

సాధారణంగా చాలా మంది రైళ్లలో వెళ్లేందుకు ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. అవి కన్ఫర్మ్ అయినా, కాకపోయినా అకౌంట్ నుంచి డబ్బులు మాత్రం కట్ అవుతాయి. అయితే IRCTC కొత్తగా ప్రవేశపెట్టిన బుక్ నౌ.. పే లేటర్ పథకంతో ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ సమయంలో డబ్బులు లేకపోయినా ఇకపై పెద్దగా ఇబ్బంది ఉండదు.
బుక్ నౌ.. పే లేటర్
బుక్ నౌ.. పే లేటర్ పథకం ద్వారా ప్రయాణీకులు ముందుగా డబ్బులు చెల్లించకుండానే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కానీ టికెట్ మొత్తాన్ని 14 రోజుల లోపు చెల్లించాలి. సకాలంలో చెల్లిస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఒకవేళ లేటుగా డబ్బు చెల్లిస్తే 3.5% సర్వీస్ ఛార్జ్ పడుతుంది.
డబ్బు లేకపోయినా..
ఈ పథకం ప్రయాణ ఆర్థిక భారాన్ని తాత్కాలికంగా తగ్గిస్తుంది. అత్యవసర ప్రయాణాలు, చివరి నిమిషంలో బుకింగ్‌ల కోసం ప్రయాణీకులు ఇప్పుడు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. డబ్బు లేకపోయినా ఈజీగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
బుకింగ్ ఇలా..
పే లేటర్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి ముందుగా రైలు ప్రయాణీకులు www.epaylater.in వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలి. IRCTC ఖాతాలోకి లాగిన్ అయ్యాక.. 'బుక్ నౌ ను క్లిక్ చేసి, అవసరమైన వివరాలను నమోదు చేయాలి. తర్వాత పేమెంట్ పేజీలో పే లేటర్ ఆప్షన్ ను ఎంపిక చేసుకొని ఈజీగా టికెట్ బుక్ చేసుకోవచ్చు.