వామ్మో! క్యాన్సిల్ చేసిన టికెట్ల ద్వారా రైల్వేకి వందల కోట్ల ఆదాయం వస్తోందా?
రిజర్వేషన్ చేయించిన రైల్వే టికెట్లు క్యాన్సిల్ చేస్తే కొంత శాతం కట్ అయి మిగిలిన డబ్బులు మాత్రమే మనకు ఇస్తారు కదా.. ఇలా క్యాన్సిల్ చేసిన టికెట్ల ద్వారా రైల్వే డిపార్ట్ మెంట్ కి ఎంత ఆదాయం వస్తోందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.

సాధారణంగా లాంగ్ టూర్ వెళ్లాలనుకున్నప్పుడు ముందుగానే ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటాం కదా.. అయితే జర్నీ చేసే డేట్, టైమ్ దగ్గరకు వచ్చినప్పుడు అనుకోకుండా ప్రయాణం మానుకోవాల్సి వస్తుంది. వెంటనే అందరూ చేసే పని ఏంటంటే టికెట్ క్యాన్సిలేషన్. ఇది జర్నీ డేట్, టైమ్, ట్రైన్ స్టార్ట్ అయ్యే సమయం ఇలా చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా టికెట్ క్యాన్సిలేషన్ చేయిస్తే 5 శాతం నుంచి 70 శాతం వరకు క్యాన్సిలేషన్ ఛార్జీలు తీసుకుంటారు. ఇలా వచ్చిన డబ్బులతో ఏటా రైల్వే డిపార్ట్ మెంట్ కి ఎంత ఆదాయం వస్తోందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్యర్యపోతారు. ఆ వివరాలను ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
రైల్వే డిపార్ట్ మెంట్ రెండు రకాల టిక్కెట్లను అమ్ముతుంది. అవి కన్ఫర్మ్డ్, వెయిటింగ్ లిస్ట్ (లేదా RAC) టిక్కెట్లు. రైలు ప్రయాణానికి చార్ట్ సిద్ధం చేసే సమయానికి కన్ఫర్మ్డ్ టిక్కెట్లు లభించకపోతే చాలా మంది ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్‌లో ఉండిపోతారు.
IRCTC వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయి. అయితే రిజర్వేషన్ కౌంటర్‌లో టిక్కెట్లు ఇస్తే ప్రయాణికులు వాటిని మాన్యువల్‌గా రద్దు చేసుకోవాలి.
రైల్వే నిబంధనల ప్రకారం టిక్కెట్లను రద్దు చేసేటప్పుడు ప్రయాణికులు రిజర్వేషన్ ఛార్జీ చెల్లించాలి. రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు ఒక ప్రయాణికుడు కన్ఫర్మ్డ్ టికెట్‌ను రద్దు చేస్తే ప్రయాణికులు మినిమం ఛార్జీ చెల్లించాలి.
రైలు బయలుదేరడానికి 12 నుండి 48 గంటల లోపు రద్దు చేస్తే టికెట్ ధరలో 25% కట్ చేసి మిగిలిన అమౌంట్ ఇస్తారు. రైలు బయలుదేరడానికి 12 గంటల ముందు రద్దు చేస్తే టికెట్ ధరలో 50% కట్ అవుతుంది.
రైల్వే స్టేషన్ లోని రిజర్వేషన్ కౌంటర్ నుండి టికెట్ కొనుగోలు చేస్తే రూల్స్ ప్రకారం ప్రయాణికులు కట్ అయిన అమౌంట్ కాకుండా మిగిలిన డబ్బులు తీసుకోవచ్చు. కానీ IRCTC యాప్, వెబ్ సైట్ ద్వారా టికెట్ తీసుకుంటే ప్రయాణికులు కన్వీనియన్స్ ఛార్జీ కూడా చెల్లించి మిగిలిన డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది.
రైల్వే శాఖకు రద్దు ఆదాయంపై ప్రత్యేక ఖాతా లేదని ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే 2017-2020 మధ్య రైల్వే టికెట్ రద్దు ద్వారా రూ.9000 కోట్లు ఆర్జించినట్లు రైల్వే ఇన్ఫర్మేషన్ సెంటర్ (CRIS) తెలిపింది.
IRCTC కన్వీనియన్స్ ఛార్జీ, రద్దు ఛార్జీలను వసూలు చేస్తుంది. ఫిబ్రవరి 8, 2023న పార్లమెంటులో మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం కన్వీనియన్స్ ఛార్జీ ద్వారా 2019-20లో రైల్వే డిపార్ట్ మెంట్ కి రూ.352.33 కోట్లు, 2020-21లో రూ.299.17 కోట్లు, 2021-22లో రూ.694.08 కోట్లు, 2022-23లో రూ.604.40 కోట్లు ఆదాయం లభించింది. అంటే క్యాన్సిలేషన్ టికెట్ల ద్వారా ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తోందన్న మాట.