Train Ticket: జనరల్ రైలు టికెట్ నిబంధనల్లో మార్పులు!
భారతీయ రైల్వే త్వరలో జనరల్ టికెట్ నిబంధనల్లో మార్పులు చేయనుంది. ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందో ఇక్కడ చూద్దాం.

భారతీయ రైల్వేలో రోజూ కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. ఇందులో రిజర్వేషన్, జనరల్ రెండు ఆప్షన్లు ఉంటాయి. రిజర్వ్ చేసిన బోగీల్లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ ఛైర్ కార్, స్లీపర్, సెకండ్ సీటింగ్ లాంటి ఆప్షన్లతో ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వ్ చేయని ప్రయాణం జనరల్ బోగీల ద్వారా సాధ్యమవుతుంది.
టికెట్ రూల్స్ లో మార్పులు
భారతీయ రైల్వే జనరల్ టికెట్ బుకింగ్ రూల్స్ లో కొన్ని మార్పులు చేయనుంది. ప్రస్తుతం, జనరల్ టికెట్లు ఉన్న ప్రయాణికులు సులువుగా ఏ రైలు అయినా ఎక్కొచ్చు. అయితే, రాబోయే మార్పుల వల్ల ఈ అవకాశం ఉండకపోవచ్చు. రైళ్ల పేర్లను జనరల్ టికెట్లలో ఎంటర్ చేయొచ్చు. ఒకసారి టికెట్‌లో రైలు పేరు ఎంటర్ చేశాక.. ప్రయాణికులు ఆ రైల్లోనే వెళ్లాల్సి ఉంటుంది.
ప్రయాణికుల జాగ్రత్త కోసం
ప్రయాణికుల రద్దీ కారణంగా ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇలాంటి గందరగోళాన్ని నివారించడానికి, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి ఈ సిస్టమ్‌ను మార్చే విషయంపై అధికారులు ఆలోచిస్తున్నారు. జనరల్ టికెట్లలో రైలు పేర్లను నమోదు చేయడం పెద్ద మార్పనే చెప్పుకోవాలి.
జనరల్ టికెట్ బుకింగ్ రూల్స్
కొత్త రూల్ ప్రకారం ఒక రైలు ఒక టికెట్‌కు కేటాయించాక, ప్రయాణికులు ఆ ప్రత్యేక రైల్లోనే ప్రయాణించాలి. ఈ చర్య రద్దీని క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించబడింది. రైల్వే రూల్స్ ప్రకారం, ఒక జనరల్ టికెట్ కొన్న సమయం నుంచి మూడు గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
త్వరలో కొత్త రూల్స్
ఈ టైమ్‌లో ప్రయాణం మొదలుపెట్టకపోతే, టికెట్ చెల్లదు. జనరల్ టికెట్ సిస్టమ్‌లో ఈ ప్రతిపాదిత మార్పులు ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి, రైలు ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా, వ్యవస్థీకృతంగా చేయడానికి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త రూల్స్ గురించి రైల్వే మంత్రిత్వ శాఖ త్వరలో అధికారిక ప్రకటన చేస్తుందని అంతా భావిస్తున్నారు.