మునిగే అవకాశమే లేని టైటానిక్ ఎలా మునిగిపోయింది?
అసలు మునిగే అవకాశమే లేదనుకున్న టైటానిక్ ఎలా మునిగింది? ఈ విషాద ఘటనకు ముందు జరిగిన పరిణాలేమిటి? తెలుసుకుందాాం.

Titanic Ship
Titanic Ship : ఆకాలంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన నౌక. ఎన్నో భద్రతా ప్రమాణాలతో సముద్రంలో విలాసవంతమైన ప్రయాణం కోసం దీన్ని నిర్మించారు. ఇక ఇది అసలు సముద్రంలో మునిగే అవకాశమే లేదని అందరూ భావించారు. కానీ దాని మొదటి ప్రయాణమే విషాదాంతంగా మిగిలింది. అదే టైటానిక్ నౌక. ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ఘోర ప్రమాదానికి గురయి ఎందరో ప్రాణాలను బలితీసుకుని విషాదాన్ని మిగిల్చింది.
ఈ భారీ నౌక ప్రమాదాన్ని హాలీవుడ్ మూవీ 'టైటానిక్' లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ ప్రమాద దృశ్యాలు చూసేవారితో కన్నీరు పెట్టిస్తాయి. సినిమాలోనే ఇలా వుంటే నిజంగా టైటానిక్ ప్రమాద సమయంలో పరిస్థితి ఎలావుందో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
Titanic Ship
టైటానిక్ ఎలా మునిగింది :
ప్రపంచంలోనే విలాసవంతమైన నౌకను నిర్మించాలని 'వైట్ స్టార్ లైన్' అనే సంస్థ భావించింది. ఈ బాధ్యతను 'హర్లాండ్ ఆండ్ వోల్స్' అనే నౌకా నిర్మాణ సంస్థకు అప్పగించింది. ఇలా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రయాణ నౌక 'టైటానిక్' నిర్మాణం 1909 లో ప్రారంభమయ్యింది.
దాదాపు రెండేళ్లపాటు ఈ నౌక నిర్మాణం జరిగింది. చివరకు 1912 లో దీని పూర్తి నిర్మాణం పూర్తయ్యింది. ఇది 46,328 టన్నుల బరువు, 882 అడుగుల పొడవు, 92 అడుగుల వెడల్పు, 175 అడుగులు (53 మీటర్ల) ఎత్తు కలిగిన భారీ షిప్. ఇందులో విలాసాలకు లోటు లేకుండా ఏర్పాట్లు చేసారు. రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్, రీడింగ్ రూమ్స్, స్మోకింగ్ రూమ్స్... ఇలా సముద్రంలో తేలియాడే ఓ స్టార్ హోటల్ నే నిర్మించారు.
ఈ నౌక నిర్మాణానికి ఆనాడు అందుబాటులో వున్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. నౌక మొత్తాన్ని విద్యుద్దీకరించేలా నీటి ఆవిరితో నడిచే జనరేటర్లను ఉపయోగించారు. అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్మించిన ఈ టైటానిక్ సముద్రంలో నిరంతరాయంగా ప్రయాణిస్తుందని అందరూ భావించారు.
ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ టైటానిక్ 1912, ఏప్రిల్ 10న సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ నుండి అమెరికాలోని న్యూయార్క్ కు ప్రయాణికులతో బయలుదేరింది. ఫ్రాన్స్ లో కొందరు, ఐర్లాండ్ లో మరికొందరు ప్రయాణికులను ఎక్కించుకుని న్యూయార్క్ ప్రయాణం సాగిస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది.
బయలుదేరిన నాలుగు రోజులకు అంటే 1912చ ఏప్రిల్ 14న టైటానిక్ మంచుకొండను ఢీకొట్టింది. రాత్రి 11.40 గంటలకు నౌక ఉత్తర అమెరికా సమీపంలోని ఓ ద్వీపమైన న్యూఫౌండ్ లాండ్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. నౌక మంచుకొండను ఢీకొట్టగానే ఒక్కసారిగా కుదుపుకు గురయ్యింది. ఇలా మంచుకొండను ఢీకొట్టిన నౌక భాగం దెబ్బతిని సముద్రపు నీరు లోనికి చేరడం ప్రారంభమయ్యింది.
టైటానికి మునిగిపోతుందని గుర్తించిన సిబ్బంది ప్రయాణికులను కాపాడేందుకు లైఫ్ బోట్లను సిద్దంచేసారు. అయితే ఈ లైఫ్ బోట్లు అందరినీ కాపాడేంత లేకపోవడంతో కొందరు మాత్రమే ప్రాణాలతో బైటపడ్డారు. 1517 మంది టైటానిక్ తో పాటే జలసమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన సమయం నుండి టైటానిక్ మునిగిపోడానికి దాదాపు 45 సమయం పట్టింది. చనిపోయినవారిలో అత్యధికులు నౌకలో పనిచేసే సిబ్బందే.