తెలంగాణ ఎన్నికల బరిలో వైఎస్ షర్మిల.. విలీనంపై వెనక్కి తగ్గినట్టేనా..!
కాంగ్రెస్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై గత కొంతకాలంగా ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ys sharmila
కాంగ్రెస్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై గత కొంతకాలంగా ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో విలీనంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విధించిన డెడ్‌లైన్ ముగియడం, కాంగ్రెస్ నుంచి ఏ విధమైన స్పందన లేకపోవడంతో.. ఇరు పార్టీల శ్రేణుల్లో ఎం జరగబోతుందనే ఆసక్తి నెలకొంది.
అయితే తాజాగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం ప్రక్రియకు బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానంతో విలీన ప్రక్రియపై తుదిదశ చర్చలు జరిపేందుకు షర్మిల ఢిల్లీ వెళ్లనున్నట్టుగా ప్రచారం జరిగినప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదని సమాచారం. వైఎస్సార్‌టీపీ విలీన ప్రక్రియ ప్రతిపాదనను వైఎస్ షర్మిల వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది.
ఇక, రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగాలని వైఎస్ షర్మిల భావిస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన కార్యచరణ మొదలుపెట్టాలని.. ఈ నెల 9 నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తికనబరుస్తున్న వారి నుంచి దరఖాస్తులు కూడా ఆహ్వానించాలని షర్మిల నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు.
ఇక, షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారని.. అంతేకాకుండా మరో స్థానం నుంచి ఆమె బరిలో నిలవాలని ఆమె భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. షర్మిలతో చర్చలు జరిపేందుకు ముందుకు వస్తారా? లేదా? అనేది మరి కొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.
ఇదిలాఉంటే, దివంగత మాజీ సీఎం వైఎస్సార్ మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన తనయుడు వైఎస్ జగన్ వైఎస్సార్‌సీపీ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కుటుంబం మొత్తం జగన్‌కు తోడుగా నిలిచింది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్‌సీపీ ఘన విజయం సాధించి.. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో షర్మిల.. జగన్‌కు దూరంగా జరిగారు. అనంతరం తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిలు.. రాష్ట్రంలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొంటూ వైఎస్సార్‌టీపీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3,800 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగారు.
ys sharmila visits medaram
అయితే గత కొన్ని నెలలుగా కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై చర్చలు సాగుతున్నాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు షర్మిల చర్చలు జరిపారు. అయితే ఈ పరిణామాలను టీ కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు స్వాగతించగా.. చాలా మంది వ్యతిరేకించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కూటమిగా బరిలో దిగగా చంద్రబాబును బూచిగా చూపి కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకున్నారని.. ఇప్పుడు షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయితే మరోసారి కేసీఆర్ చేతికి అస్త్రం దొరికినట్టే అవుతుందని వారు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
అయితే డీకే శివకుమార్, సునీల్ కనుగోలు మాత్రం షర్మిలను కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిపారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చలు జరిపారు. దీంతో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనానికి అంత సిద్దమైందని భావించారు. అయితే కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై షర్మిల విధించిన డెడ్‌లైన్ ముగియడంతో.. ఆ ప్రక్రియ సందిగ్దంలో పడిపోయింది. ఇప్పుడు తాజాగా విలీన ప్రతిపాదనపై షర్మిల వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది.