- Home
- Telangana
- Jubilee Hills లో గెలుపు ఇంత కీలకమా..? అందుకే రేవంత్, కేటీఆర్ రంగంలోకి దిగారా..? ఇకపై ఏం జరగనుంది?
Jubilee Hills లో గెలుపు ఇంత కీలకమా..? అందుకే రేవంత్, కేటీఆర్ రంగంలోకి దిగారా..? ఇకపై ఏం జరగనుంది?
Jubilee Hills By Election Result 2025 : జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపించనుంది. రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేయనుంది… ఎలాగో తెలుసా?

జూబ్లీహిల్స్ ఎందుకింత ప్రత్యేకం...
Jubilee Hills By Election 2025 : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చాలా సాధారణమైనది... ఓ ఎమ్మెల్యే మరణించడంతో అనుకోకుండా వచ్చింది. కానీ ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకున్నాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగైదు రోజులు రోడ్ షోలు నిర్వహించారంటే ఫైట్ ఎంత సీరియస్ గా నడిచిందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకిలా అధికార, ప్రతిపక్ష పార్టీలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ఎందుకింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో తెలుసా? ఈ ఎన్నిక ద్వారా యావత్ తెలంగాణ పొలిటికల్ సినారియోను మార్చేయవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ గెలుపుతో కాంగ్రెస్ కు కలిసివచ్చేదిదే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ళు కావస్తోంది. అయితే ఈ ప్రభుత్వానికి పాలన చేతకావడంలేదని... ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS) ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియా, తమ సొంత మీడియా, క్షేత్రస్థాయి నాయకత్వం ద్వారా బిఆర్ఎస్ దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగింది. కాంగ్రెస్ పాలన కంటే బిఆర్ఎస్ పాలనే బాగుండేదని... మళ్లీ కేసీఆర్ సారే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెగ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వచ్చింది. ఇది కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా మారింది... ప్రజల తమ అభిప్రాయాన్ని తెలియజేసే వేదికగా మారింది. ఈ గెలుపు ద్వారా కాంగ్రెస్ తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకుని... పొలిటికల్ సీన్ తిరగేయవచ్చు.
రేవంత్ రెడ్డి బలం మరింత పెరిగినట్లే...
ఇక ఈ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భుజానేసుకున్నారు. స్వయంగా బహిరంగ సభ, రోడ్ షోలలో పాల్గొని తెగ ప్రచారం చేశారు. కాంగ్రెస్ శ్రేణులను ముందుండి నడిపించారు. కానీ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే పూర్తి బాధ్యతలు చూసుకున్నారు. కాబట్టి పార్టీని గెలిపించుకోవడం ద్వారా కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ మరోసారి పైచేయి సాధించినట్లు అయ్యింది. ఆయన బలం మరింత పెరిగి కేసీఆర్, కేటీఆర్ బలం తగ్గినట్లుగా ఈ ఎన్నికల ఫలితం ఉంది. దీన్ని రేవంత్ వర్గం బాగా వాడుకుని ఆయనను హైలైట్ చేసే అవకాశం దక్కింది.
అర్బన్ లో కాంగ్రెస్ హవా
అలాగే ఇంతకాలం బిఆర్ఎస్ కు అర్బన్ ప్రాంతాల్లో మంచి పట్టు ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇది నిరూపితమయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్ కు అత్యధిక ఓట్లు సీట్లు వచ్చాయి... పట్టణాలు, నగరాల్లో ఆ పార్టీ చతికిలపడింది. హైదరాబాద్ లో అయితే కనీసం ఒక్కసీటుకూడ సాధించలేకపోయింది. ఇదే సమయంలో బిఆర్ఎస్ అర్బన్ ప్రాంతాల్లో తిరుగులేని ఆదిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో కాంగ్రెస్ అంటే గ్రామీణ పార్టీ, బిఆర్ఎస్ అంటే అర్బన్ పార్టీ అనే అభిప్రాయం ఏర్పడింది. మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో విజయం సాధించింది కాంగ్రెస్... తద్వారా ఈ అభిప్రాయాన్ని మార్చేందుకు అవకాశం దక్కింది.
రాబోయే ఎన్నికలపై ప్రభావం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎంతగానో ఉపయోగపడనుంది. అర్భన్ ఓటర్లు కూడా తమపై నమ్మకంతో ఉన్నారనే మెసేజ్ ను పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లి మరింత ఉత్సాహంగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. హైదరాబాద్ లో కాంగ్రెస్ న మరింత బలంగా నిర్మించేందుకు ఈ జూబ్లీహిల్స్ గెలుపు పునాదిగా మారనుంది. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు కలివస్తుంది.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కు ప్లస్... బిఆర్ఎస్ కు మైనస్
జూబ్లీహిల్స్ ఓటమి బిఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బే... ఇంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మడంలేదని బైటపడింది. అంతేకాదు బిఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని పెంచే అవకాశం ఉంది. అంతేకాదు కేటీఆర్ నాయకత్వాన్ని మరింత బలహీనపర్చింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్, పలు ఎమ్మెల్సీ, వరుసగా రెండు ఉపఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమిపాలయ్యింది. అన్నింటిలోనూ కేటీఆర్ నాయకత్వంలోనే బరిలోకి దిగింది.
ఇలా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ కు ప్లస్... బిఆర్ఎస్ కు మైనస్ గా మారింది. ఈ ఫలితం ఒక్క హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ పాలిటిక్స్ ను ప్రభావితం చేయనుంది. ఇకపై తెలంగాణ రాజకీయాలు మరో టర్న్ తీసుకుంటాయని స్పష్టమవుతోంది.