అసలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటే ఏమిటి? ఇందులో ఏ నిర్మాణాలున్నాయో ఎలా తెలుసుకోవడం?
హైదరాబాద్ లో 'హైడ్రా' ఎంట్రీ తర్వాత ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు ఇవి ఏంటి? వీటి పరిధిలోని స్థలాలు, నిర్మాణాలను గుర్తించడం ఎలా?...
Hydra
Hydra : తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడచూసినా 'హైడ్రా'పై చర్చే. రాజధాని హైదరాబాద్ లోని చెరువులు, నాలాల కబ్జాను అరికట్టేందుకు, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు రేవంత్ సర్కార్ సంధించిన బ్రహ్మాస్త్రమే హైడ్రా. రేవంత్ సర్కార్ సంపూర్ణ అధికారాలు ఇవ్వడంతో మంచి దూకుడుమీదున్న హైడ్రా నగరంలోని చెరువుల పరిరక్షణపై ముందుగా దృష్టిపెట్టింది. చెరువులను ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది. పెద్దలు, పేదలు అని తేడాలేదు... చెరువులు, నాలాలను ఆక్రమించినట్లు నిర్దారణకు వస్తే చాలు... వెంటనే కూల్చివేతలు చేపడుతోంది.
సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసి హైడ్రా (హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ ఆండ్ అస్సెట్స్ మానిటరింగ్ ఆండ్ ప్రొటెక్షన్ ఏజన్సీ) సంచలనం సృష్టించింది. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసారి రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన నిర్మాణాలను కూల్చేసారు. ఇక సినీ నటులు మురళీమోహన్ కు చెందిన నిర్మాణానికి కూడా నోటీసులు అందించారు. మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు సొదరుడి నిర్మాణాన్ని కూడా కూల్చివేసారు.చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడాహైడ్రా నోటీసులు ఇచ్చింది. ఇలా బడాబాబులు, రాజకీయ పలుకుబడి కలిగినవారినే హైడ్రా వదిలిపెట్టడం లేదు... ఇక సామాన్యులను వదిలిపెడుతుందా... ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టడదనే చర్చ సాగుతోంది.
ఈ సందర్భంగానే ప్రజల్లో పలు అనుమానాలు మెదులుతున్నాయి. హైడ్రా చెరువుల చుట్టూ వుండే ఏ నిర్మాణాలను కూల్చేస్తుంది? ఎఫ్‌టీఎల్ అంటే ఏమిటి? బఫర్ జోన్ అంటే ఏమిటి? చెరువుల పరిధిలో నిర్మాణాలను గుర్తించడం ఎలా? హైడ్రా కేవలం హైదరాబాద్ కే పరిమితమా? ఇతర నగరాలు, పట్టణాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారా?... ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ఈ విషయాల గురించి తెలుసుకుందాం.
Hydra
ఎఫ్‌టీఎల్ అంటే :
తెలంగాణ రాష్ట్రంలో వేలాది గొలుసుకట్టు చెరువులు వున్నాయి. ఈ చెరువులు చాలా ప్రత్యేకమైనవి... ఓ చెరువు నిండాక మిగిలిన నీరంతా మరో చెరువులోకి వెళ్లేలా ఏర్పాట్లున్నాయి. ఇలా గొలుసుకట్టు చెరువుల ద్వారానే వ్యవసాయం సాగేది. అయితే కాలం మారుతున్నకొద్ది వ్యవసాయం తగ్గింది... మనుషులు పెరిగారు. దీంతో మెళ్లిగా చెరువుల కబ్జా మొదలయ్యింది. ఇలా హైదరాబాద్ వంటి నగరాల్లో కొన్ని చెరువులు కనుమరుగయ్యాయి... మరికొన్ని ప్రమాదపుటంచుల్లో వున్నాయి. నగర జనాభా పెరిగిపోవడంతో చెరువుల కబ్జా మొదలయ్యింది.
చెరువులో నీరు తక్కువగా వున్న సమయంలో కొంత స్థలం బయటపడుతుంది. మళ్ళీ వర్షాలు మొదలవగానే చెరువులోకి నీరు చేరడంతో ఆ స్థలంలోకి కూడా చెరువు విస్తరిస్తుంది. ఇలా నీటితో నిండుగా వున్న సమయంలో చెరువు ఎంత స్థలంలో అయితే విస్తరించి వుంటుందో దాన్నే ఎఫ్టిఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిగా గుర్తిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే చెరువులో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యమే ఎఫ్టిఎల్.
చెరువుల ఎఫ్టిఎల్ పరిధిని గతంలోనే నిర్దారించారు. ఈ పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. చెరువులో నీరు తక్కువగా వున్న సమయంలో ఎఫ్టిఎల్ పరిధిలో వ్యవసాయం చేసుకోవచ్చు. అయితే నీటిని అడ్డుకుని చెరువు స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు.
Hydra
బఫర్ జోన్ అంటే :
చెరువు పూర్తిస్థాయి నీటిమట్టానికి (ఎఫ్టిఎల్) చేరుకున్న తర్వాత కూడా మరింత నీరు వచ్చి చేరితే విస్తరించేందుకు అవకాశం వుండాలి. కాబట్టి ఎఫ్టిఎల్ చుట్టూ కొంత ప్రాంతాన్ని ఖాళీగా వదిలేస్తారు. దీన్నే బఫర్ జోన్ అంటారు. చెరువు విస్తీర్ణాన్ని బట్టి బఫర్ జోన్ ను నిర్దారిస్తారు.
నదులకు ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ వుంటుంది. ఇక పెద్దపెద్ద జలాశయాలు అంటే 25 ఎకరాలకు పైగా విస్తీర్ణాన్ని కలిగివుండే చెరువులు, కుంటలకు 30 మీటర్ల బఫర్ జోన్ వుంటుంది.25 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం కలిగివుండే వాటికి 9 మీటర్ల బఫర్ జోన్ వుంటుంది.
ఈ బఫర్ జోన్ పరిధిలోకి కూడా ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. చెరువుల సహజ స్వరూపాన్ని మార్చే ఎలాంటి చర్యలు కూడా బఫర్ జోన్ పరిధిలో చేపట్టకూడదు. ఈ బఫర్ జోన్ అవతలే నిర్మాణాలను చేపట్టాలి.
Hydra
ఎఫ్టిఎల్, బఫర్ జోన్ లో కబ్జాలు :
జనాభా పెరిగేకొద్ది నదులు, చెరువుల చుట్టూ నిర్మాణాలు కూడా పెరిగాయి. దీంతో మెళ్ళిగా బఫర్ జోన్, ఆ తర్వాత ఎఫ్టిఎల్ ఆక్రమణలు ప్రారంభమయ్యారు. సంబంధిత ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ లోపంతో చెరువుల ఆక్రమణలు యధేచ్చగా సాగుతున్నాయి. దీంతో వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంబవిస్తున్నాయి.
హైదరాబాద్ లో కూడా ఇలాగే చెరువుల కబ్జా చాలాకాలంగా కొనసాగుతూ వస్తోంది. దీంతో కొన్ని చెరువులు కనుమరుగా కాగా మరికొన్ని కుచించుకుపోయి చిన్నచిన్న నీటికుంటల్లా మారాయి. ఇలా చెరువుల్లో వెలిసిన అపార్ట్ మెంట్, ఇళ్లు వర్షాకాలం వచ్చిందంటే నీట మునుగుతుంటాయి. అలాగే వర్షపునీరు చేరే చెరువులు కబ్జాకు గురవడంతో రోడ్డుపై పారుతుంటాయి. దీంతో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
హైదరాబాద్ లో ఈ పరిస్థితిని మార్చి తిరిగి పూర్వస్థితికి చెరువులను తీసుకువచ్చేందుకు రేవంత్ సర్కార్ నడుం బిగించింది. అందుకోసం సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ రంగనాథ్ ను కమీషనర్ గా నియమించి 'హైడ్రా' పేరుతో సరికొత్త సంస్థను ఏర్పాటుచేసింది. ఈ సంస్థ చెరువులను కబ్జాల నుండి కాపాడేందుకు కృషి చేస్తోంది.
Hydra
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ను ఎలా గుర్తించాలి?
హైదరాబాద్ లోని అన్ని చెరువులకు సంబంధించిన వివరాలను ఆ రోజుల్లోనే మెయింటెన్ చేసారు. ఇవి ఇప్పటికీ అందుబాటులో వున్నాయి. హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్ సైట్ https://lakes.hmda.gov.in/ లోకి వెళ్లి ఈ వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసాక జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ ఎంచుకున్న ప్రాంతంలోని చెరువుల వివరాలు వస్తాయి.
ఎఫ్టిఎల్ కాలమ్ పై క్లిక్ చేయగానే ఆ చెరువుకు సంబంధించిన మ్యాప్ వస్తుంది. ఆ చెరువు ఎఫ్టిఎల్, బఫర్ జోన్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్ని కనిపిస్తాయి. అక్షాంశాలు, రేఖాంశాలు కూడా వుంటాయి. ఈ మ్యాప్ లో బ్లూ కలర్ లైన్ లో వున్నదంతా ఎఫ్టిఎల్, రెడ్ కలర్ లో ఉన్నది బఫర్ జోన్.
ఇదే వెబ్ సైట్ లో క్యాడస్ట్రల్ అనే మరో ఆప్షన్ కూడా వుంటుంది. ఇందులో చెరువు ఏయే సర్వే నంబర్ల పరిధిలో వుందో వుంటుంది.
ఇలా చెరువు మ్యాప్, సర్వే నంబర్ల ఆధారంగా నిర్మాణాలు చెరువులో వున్నాయా? బయట వున్నాయో తెలుసుకోవచ్చు. హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్ సైట్ లో హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలోని 2,567 చెరువుల వివరాలు తెలుసుకోవచ్చు.