హుజూరాబాద్‌పై ఫోకస్: పట్టు కోసం టీఆర్ఎస్ ప్లాన్ ఇదీ...
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంపై బీజేపీ, టీఆర్ఎస్ ఇప్పటినుండే కన్నేశాయి.ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం కోసం అస్త్రాలను సిద్దం చేసుకొంటున్నాయి
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానిక ఉప ఎన్నికలకు ఇప్పటి నుండే టీఆర్ఎస్ సన్నద్దమౌతోంది. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఒడించేందుకు గులాబీ దళం అస్త్రాలను సిద్దం చేసుకొంటుంది.
ఈ నెల 14వ తేదీన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. అంతకుముందే ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.ఈటల రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఈ స్థానం ఖాళీ అయిందని ఈసీకి తెలంగాణ స్పీకర్ కార్యాలయం ఈసీకి సమాచారం పంపింది.
హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో వ్యూహాలను అమలు చేస్తోంది. గత వారంలో హరీష్ రావు నేతృత్వంలో జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్లానింగ్ బోర్డు చైర్మెన్ వినోద్ కుమార్ లు సమావేశమయ్యారు. హుజూరాబాద్ లో అమలు చేయాల్సిన వ్యూహాంపై చర్చించారు.
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందుతున్న లబ్దిదారులను లక్ష్యంగా చేసుకొని టీఆర్ఎస్ వ్యూహాలను రచించనుంది. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ వైపు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వెళ్లకుండా ఆ పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్గీయులు, ఈటల రాజేందర్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. తన వర్గాన్ని కాపాడుకొనేందుకు ఈటల కూడ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు కూడ గణనీయంగా ఉన్నారు. ఈ ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే భాగంగానే టీడీపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు ఎల్. రమణతో టీఆర్ఎస్ నేతలు చర్చించారని సమాచారం.
ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసే అభ్యర్ధి ఎవరైనా కూడ విజయం సాధించడమే లక్ష్యంగా గులాబీ దళం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను బీజేపీ నాయకత్వం అమలు చేయనుంది.
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించింది.
కానీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితులు కమలదళంపై ఉన్నాయి. దీంతో బీజేపీ కూడ ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు శక్తియుక్తులను ప్రయత్నిస్తోంది.