తెలంగాణ తల్లి రూపం నిజంగానే ఆమెను పోలివుందా..?
తెలంగాణ తల్లి రూపం విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష నేతల మధ్య మాటలయుద్దం సాగుతోంది. ఈ క్రమంలో ఆ తల్లి రూపం గురించి సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికన వివరించారు.
Telangana Talli
Telangana Talli Statue : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుతోంది. రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చిన ప్రభుత్వం ఆ విగ్రహాన్నే సెక్రటేరియట్ వద్ద ఏర్పాటుచేసారు.
అయితే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి రూపం సీఎం రేవంత్ భార్య గీత, కూతురు నైమిషా రెడ్డిని పోలివుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. గత పదేళ్లు కొనసాగించిన తెలంగాణ తల్లి విగ్రహం ఆనాటి సీఎం కేసీఆర్ కూతురు, ప్రస్తుత ఎమ్మెల్సీ కవితను పోలివుందని అంటున్నారు. అంతేకాదు ఒంటినిండా నగలు, తలపై కిరీటంతో తెలంగాణ తల్లి రూపం సామాన్య తెలంగాణ ఆడబిడ్డలా కాకుండా దొరసానిలా వుండేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఇలా తెలంగాణ తల్లి రూపం విషయంలో అధికారం కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ క్రమంలోనే కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి రూపం గురించి ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ వేదికన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పాత రూపాన్ని మార్చి కొత్తగా ఎందుకు రూపొందిచాల్సి వచ్చింది... తాజా రూపం ప్రత్యేకతలు ఏమటో రేవంత్ అసెంబ్లీ వేదికన వివరించారు.
Reavnth reddy
తెలంగాణ దేవతా? తెలంగాణ తల్లా?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ... ఈ రోజె డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పర్వదినమని అన్నారు. తన పుట్టినరోజున తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేలా సోనియా గాంధి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయించారని రేవంత్ తెలిపారు.
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయ్యింది... ఇప్పటివరకు అధికారికంగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదించకపోవడం దురదృష్టకరమని సీఎం రేవంత్ అన్నారు. అందువల్లే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆ తల్లి రూపాన్ని తీర్చిదిద్దామని అన్నారు. చాలా తర్జనభర్జన పడి యావత్ తెలంగాణ ప్రజల కోరికకు తగ్గట్లే ఇప్పుడున్న తెలంగాణ తల్లి రూపం వుందని రేవంత్ తెలిపారు.
ఈ విగ్రహా రూపకల్పన సమయంలో తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి అంశాలు ప్రస్తావనకు వచ్చాయని సీఎం తెలిపారు. వజ్ర వైఢూర్యాలతో, బంగారు ఆభరణాలు, తలపై కిరీటంతో దేవతలా వుండాలా? సాధారణ తెలంగాణ మహిళలను పోలి ఓ తల్లిలా ఉండాలా ఉండాలా? అని ప్రస్తావన వచ్చిందన్నారు. చివరకు తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించినట్లు రేవంత్ వెల్లడించారు.
తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన భావన కలుగుతుందని రేవంత్ అన్నారు. ఈ బహుజనుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ ప్రతిష్ఠించుకోబోతున్నామని అన్నారు.నాలుగుకోట్ల తెలంగాణ సమాజమంతా ఏకమై ఇవాళ పండగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోబోతోందన్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని సీఎం వెల్లడించారు.
ప్రతీ సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుందామని రేవంత్ సూచించారు. తెలంగాణ ప్రజలంతా ఎంతో ఘనంగా సంబరాలు జరుపుకునే వేళ వివాదాలకు తావు ఇవ్వొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసారు. ఈ ఒక్కరోజు రాజకీయాలను పక్కనబెట్టి తెలంగాణ సమాజం కోసం సమయం ఇద్దామని రేవంత్ అన్నారు.
తెలంగాణ ప్రజలు ఆనందంగా సంబరాలు జరుపుకోవడం కొంతమందికి నచ్చడంలేదు... అందువల్లే తప్పుడు ప్రచారాలు చేస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేవలం ఒక్క వ్యక్తి, ఒకే పార్టీ ఆలోచన ఏనాటికి తెలంగాణ సమాజం ఆలోచన కాదు... అలా అనుకోవడం తప్పంటూ పరోక్షంగా బిఆర్ఎస్ కు చురకలు అంటించారు. మధ్యయుగాల్లో చక్రవర్తుల పాలనలా ఇవాళ పాలిస్తామంటే నడవదు... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని సీఎం రేవంత్ అన్నారు.
Telangana Talli
తెలంగాణ తల్లి రూపంపై రేవంత్ రెడ్డి క్లారిటీ :
కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి రూపం సీఎం రేవంత్ భార్య, బిడ్డను పోలివుందంటూ ప్రచారం జరుగుతున్న వేళ రేవంత్ అసెంబ్లీ వేదికన ఆసక్తికర కామెంట్స్ చేసారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనులకు ఈ తల్లి రూపం ఎంతో స్పూర్తిని ఇచ్చిందని... జాతినంతా ఏకం చేసిందన్నారు. ప్రజా పోరాటాల్లోనే ఈ తల్లి రూపం ఊపిరి పోసుకుందని... కానీ ఇప్పటివరకు ఆ తల్లికి అధికారిక రూపం లేదన్నారు. అందువల్లే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని ఆ తల్లి రూపాన్ని ఇచ్చామన్నారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు తగ్గట్లుగా తల్లి రూపం వుందన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ఆడబిడ్డలు వాడే గుండుపూసలు, హారం, ముక్కుపడకతో ఆ తల్లి ప్రశాంత వదనంతో వుందన్నారు. ఆకుపచ్చ చీరలో కాళ్లకు కడియాలు, మెట్టెలు పెట్టుకుని ఓ సామాన్య తెలంగాణ మహిళలా ఆ తల్లి రూపం వుందన్నారు. తెలంగాణలో పండే సాంప్రదాయ పంటలు వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్న కంకులు ఓ చేతిలో పట్టుకుని మరో చేత్తో ఆశీర్వదిస్తుందన్నారు. ఇక స్వరాష్ట్రం కోసం బలిదానాలు చేసిన తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం ఆ తల్లి పీఠాన్ని రూపొందించినట్లు తెలిపారు.
తెలంగాణ తల్లి రూపం తన కుటుంబసభ్యులను పోలివుందన్న ప్రచారంపైనా రేవంత్ పరోక్షంగా స్పందించారు. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం కూడా అని అన్నారు. కాబట్టి చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుని చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్పూర్తితో తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దామని... ఆ తల్లిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై వుందని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.