Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశంలోనే తొలి రాష్ట్రంగా గుర్తింపు
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అధికారికంగా అమల్లోకి వచ్చింది. న్యాయ శాఖ తాజాగా విడుదల చేసిన జీవోతో ఈ విధానం నేటి నుంచే అమలవుతోంది. గతంలో ఏప్రిల్ 8న గవర్నర్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడంతో, ప్రభుత్వం ఆ గెజిట్ నోటిఫికేషన్‌ను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో విడుదల చేసింది. దీంతో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అధికారికంగా అమల్లోకి వచ్చినట్లు అయ్యింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Telangana Chief Minister A Revanth Reddy (File photo/ANI)
ఎస్సీ వర్గీకరణ ప్రకారం మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్–ఏలో అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1 శాతం రిజర్వేషన్ కల్పించారు. గ్రూప్–బీలో ఉన్న 18 కులాలకు 9 శాతం రిజర్వేషన్, గ్రూప్–సీలో ఉన్న 26 కులాలకు 5 శాతం రిజర్వేషన్ వర్తించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఎస్సీలకు ఉన్న 15 శాతం రిజర్వేషన్లను ఈ విధంగా మూడుగా విభజించారు.

ఈ వర్గీకరణ వెనుక ప్రత్యేక అధ్యయనం ఉంది. 2024 అక్టోబర్‌లో ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన వన్ మెన్ కమిషన్‌ను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో పర్యటించి, ఎస్సీ ఉప కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసింది. మొత్తం 8,600కి పైగా ప్రతిపాదనలు అందుకున్న కమిషన్ జనాభా, అక్షరాస్యత, ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యలో ప్రవేశాలు, ఆర్థిక వనరులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై విశ్లేషణ చేసి ఫిబ్రవరి 3న తుది నివేదికను సమర్పించింది.

Telangana CM Revanth Reddy (File Photo/@revanth_anumula)
ఈ నివేదికను ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణ దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. గతేడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుమతి ఇచ్చిన వెంటనే, అదే రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అమలుకు హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తవడంతో, ఎస్సీ కులాలకు న్యాయం జరిగిందని భావిస్తున్నారు.