Telangana Bandh : శుక్రవారం తెలంగాణ బంద్.. స్కూళ్లు, కాలేజీలు మూతపడతాయా..?
Telangana Bandh : స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల ఆంశం తెలంగాణ రాాజకీయాల్లో హీట్ పెంచింది. గురువారం జరిగిన పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బిసి సంఘాలు, పార్టీలు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి.

రేపు తెలంగాణ బంద్
Telangana Bandh : ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది… ఈ వ్యవహారంపై బిసి వర్గాలు భగ్గుమంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తమ రిజర్వేషన్లను వదులుకోబోమని... ప్రభుత్వం మరింత గట్టిగా పోరాడి తమ హక్కులను కాపాడాలని బిసి సంఘాలు కోరుతున్నాయి. రిజర్వేషన్లు తగ్గించి అన్యాయం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని... తెలంగాణ బంద్ చేపడతామని హెచ్చరిస్తున్నాయి. ఇలా బీసీ సంఘం నేత, మాజీ ఎంపీ ఆర్. కృష్ణయ్య, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు మరికొందరు బిసి నాయకులు హెచ్చరిస్తున్నారు.
హైకోర్ట్ వద్ద బిసి సంఘాల నేతల ధర్నా
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల పెంపు జీవో 9పై స్టే విధించడంతో తెలంగాణ హైకోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ప్రాంగణానికి చేరుకున్న బిసి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు... మాజీ ఎంపీ ఆర్. కృష్ణయ్య కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. హైకోర్ట్ గేట్ నంబర్ 4 వద్ద రోడ్డుపైనే బిసి సంఘాల నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో వెంటనే పోలీసులు బిసి నాయకులను అదుపులోకి తీసుకుని అక్కడినుండి తరలించారు.
ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ... బిసిలకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వం బిసి రిజర్వేషన్లను మరింత పకడ్బందీగా అమలుచేయాల్సింది... తొందరపాటు చర్యలవల్ల న్యాయపరమైన సమస్యలు వచ్చాయన్నారు. ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల విషయంలో వెనక్కితగ్గితే సహించబోమని హెచ్చరించారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూస్తామని... బిసిలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలున్నా తెలంగాణ బంద్ కు పిలుపునిస్తామని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.
తెలంగాణ బంద్ కు తీన్మార్ మల్లన్న పిలుపు
బిసి నినాదంతో ఇటీవల రాజకీయ పార్టీని ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోవడంపై రియాక్ట్ అయ్యారు. బిసి రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్ట్ స్టే విధించడానికి ప్రభుత్వ నిర్ణయాలే కారణమని ఎమ్మెల్సీ అన్నారు. బిసిలకు అన్యాయం జరిగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సహించబోదని అన్నారు... తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే జరిగేలా కనిపిస్తోందన్నారు. అందుకే బిసి రిజర్వేషన్ల పరిరక్షణకై రేపు (అక్టోబర్ 10, శుక్రవారం) తెలంగాణ బంద్ కు TRP పిలుపునిస్తోందని తీన్మార్ మల్లన్న ప్రకటించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల అంశంపై బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ మల్లన్న డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బిసిలు నిరసన తెలపాలని.. రాష్ట్ర బంద్ కు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తీరువల్ల బిసిలకు అన్యాయం జరిగేలా ఉంది... కాబట్టి ఆ పార్టీ దిష్టిబొమ్మలను తగలబెడుతూ నిరసనలు తెలపాలని ఎమ్మెల్సీ మల్లన్న పిలుపునిచ్చారు.
ఏమిటీ బిసి రిజర్వేషన్ల వివాదం?
జనాభా ప్రాతిపదికన బిసిలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కులగణన చేపట్టింది. దీని ఆధారంగా బిసి రిజర్వేషన్లు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది... స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 9 తీసుకువచ్చింది. అయితే ఇలా బిసి కోటా పెంచడంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువయ్యాయి… దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి... కొందరు ఈ రిజర్వేషన్ల వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. రెండు రోజులపాటు (అక్టోబర్ 8,9) సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఈ జీవో 9పై మధ్యంతర స్టే విధించింది.
స్థానిక సంస్థల షెడ్యూల్ మారుతుందా..?
బిసి రిజర్వేషన్ల పెంపు జీవో 9పై స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ డైలమాలో పడింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడంలేదు... మరి ప్రభుత్వం, ఎన్నికల కమీషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. హైకోర్ట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఏమైనా వెళతారా? లేక ఎన్నికలను వాయిదా వేసుకుంటారా? అన్నది తేలాల్సిఉంది.
అయితే ఇవాళ (అక్టోబర్ 9న) ఎంపిటిసి, జడ్పిటిసి మొదటివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. సమయం తక్కువగా ఉండటంతో చాలామంది ఆశావహులు నామినేషన్ పేపర్లను రెడీ చేసుకున్నారు. సరిగ్గా నామినేషన్ ను సమర్పించేందుకు సిద్దమవుతున్న సమయంలో హైకోర్టు షాకిచ్చింది. రిజర్వేషన్ల పెంపు వ్యవహారం వారి నామినేషన్లను అడ్డుకట్ట వేసింది… మరి స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసేకుటుందో చూడాలి.