తెలంగాణలో ఇక టిడిపి జెండా పీకేసినట్లేనా.. కాసాని కారెక్కడం ఖాయమేనట?
తెెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల్లో పోటీకి టిడిపి దూరంగా వుండాలని నిర్ణయించుకోవడంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరి సిద్దమయ్యారట.
kasani gnaneshwar
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీనుండి తెలుగుదేశం పార్టీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన చేయకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలని టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిన్న(శనివారం) రాజమండ్రి జైల్లోని చంద్రబాబుతో తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యాడు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు... చివరకు పోటీ చేయకూడదనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు సమాచారం.
TDP
అయితే తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్దమైన కాసాని జ్ఞానేశ్వర్ అధినేత నిర్ణయంతో డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీకి సిద్దంగా వుండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కాసాని ఇప్పుడు సడన్ గా వెనక్కి తగ్గడానికి ఇష్టపడటం లేదట. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభించి టిడిపి బలంగా వున్న ప్రాంతాల్లో గెలుపుగుర్రాలను సిద్దం చేసారట కాసాని. ఇలా అన్నిస్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపినా 10 నుండి 20 స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చేలా కాసాని ప్లాన్ చేసుకున్నారట. ఇలాంటి అంతా సిద్దం చేసుకుని నేడో రేపో అభ్యర్థులను ప్రకటిద్దామని అనుకుంటున్న సమయంలో పోటీనుండి తప్పుకుందామన్నచంద్రబాబు నిర్ణయం కాసాని జ్ఞానేశ్వర్ మింగుడుపడటం లేదట. అందువల్లే తాడోపేడో తేల్చుకునేందుకు కాసాని సిద్దమైనట్లు సమాచారం.
Kasani Gnaneshwar
ఇవాళ(ఆదివారం) టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కాసాని భేటీ కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీ చేయాలా? లేదంటే గత ఎన్నికల మాదిరిగా కాంగ్రెస్ కూటమితో కలిసి వెళ్లాలా? అన్నదానిపై వీరిద్దరూ చర్చించుకోనున్నట్లు సమాచారం. కానీ ఇప్పటికే చంద్రబాబు పోటీనుండి తప్పుకుని పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతివ్వాలని నిర్ణయించారట. ఈ నేపథ్యంతో తన దారి తాను చూసుకునేందుకే కాసాని సిద్దమయ్యారట... ఇదే విషయాన్ని లోకేష్ కు చెప్పడానికే భేటీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
brs
ఇదిలావుంటే తెలంగాణలో కీలకమైన ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను పార్టీలో చేర్చుకునేందుకు అధికార బిఆర్ఎస్ అప్పుడు ప్రయత్నాలు ప్రారంభించిందట. పటాన్ చెరుకు చెందిన నీలం మధుకు టికెట్ ఇవ్వకపోవడం... అంతకు ముందే ఈటల రాజేందర్ ను పార్టీనుండి సస్పెండ్ చేయడంతో ముదిరాజ్ సామాజిక వర్గంలో అధికార పార్టీపై కాస్త వ్యతిరేకత ఏర్పడింది. ఇటీవల ముదిరాజ్ లు భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసుకుని ఈ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ హెచ్చరించారు.
Kasani Gnaneshwar
ఇలా పార్టీకి దూరమైన ముదిరాజ్ సామాజికవర్గాన్ని కాసాని జ్ఞానేశ్వర్ ద్వారా తిరిగి దగ్గరకు తీసేందుకు బిఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారట. ఇందులో భాగంగానే ఆయనకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టిడిపికి గుడ్ బై చెప్పి కారు ఎక్కాలన్న ఆలోచనలో కాసాని వున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
BJP
ఇదిలావుంటే బిజెపి కూడా కాసానిని పార్టీలో చేర్చుకుని ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనే బరిలోకి దింపాలను చూస్తోందట. ఇందుకోసం ముదిరాజ్ సామాజికవర్గానికే చెందిన కీలక నాయకుడు ఈటల రాజేందర్ ఇప్పటికే కాసానితో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. ఇలా బిఆర్ఎస్, బిజెపి రెండుపార్టీలు ప్రత్యామ్నాయంగా వున్నాయి కాబట్టి తెలంగాణలో పోటీచేయని టిడిపిని పట్టుకుని వేలాడేందుకు కాసాని జ్ఞానేశ్వర్ సిద్దంగా లేనట్లుగా సమాచారం.