Telangana assembly elections 2023: కేసీఆర్ దెబ్బకు లెప్ట్ అబ్బా!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవ్వరూ ఊహించని విధంగా రాజకీయ వ్యూహాలు రచిస్తుంటారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ లెప్ట్ పార్టీలతో కలిసి వెళతారని అందరూ భావిస్తుంటే కేసీఆర్ మంత్రి షాకిచ్చారు.

KCR
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దెబ్బకు తెలంగాణ వామపక్షాలు తీవ్ర నిరాశకు గురైనట్లు కనిపిస్తున్నాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన ప్రకటనలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. కేసీఆర్ బిఆర్ఎస్ అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేసిన తీరుకు ఆ పార్టీలు కంగు తిన్నాయి. జాబితా విడుదలకు ముందు వరకు బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని ఆ పార్టీలు భావించాయి. అధికారికంగా సీపీఐ, సిపిఎం ప్రకటనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
kcr
నిజానికి వామపక్షాలతో కేసీఆర్ పొత్తు పెట్టుకోవడానికి సుముఖంగానే ఉన్నట్లు కనిపించారు. సిపీఎం, సిపీఐ నేతలతో మధ్యవర్తుల ద్వారా చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తమ్మినేని వీరభద్రం ధ్రువీకరించారు కూడా. రెండు వామపక్షాలు చెరో ఎమ్మెల్యే సీటు, చెరో ఎమ్మెల్సీ సీటు ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. సిపిఐకి మునుగోడు, సిపిఎంకు భద్రచలం సీటు ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రతిపాదించింది. అయితే, అందుకు వామపక్షాలు అంగీకరించలేదని, మరిన్ని సీట్లు తమకు కావాలని అడిగినట్లు తెలుస్తోంది.
KCR
అయితే, అకస్మాత్తుగా కేసీఆర్ మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మునుగోడు శాసనసభ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో వామపక్షాలు బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. బిజెపి తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు. దీంతో తమ మద్దతుతోనే బీఆర్ఎస్ విజయం సాధించిందని వామపక్షాలు చెబుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు ఉంటుందని కేసీఆర్ చెప్పారు కూడా. ఈ విషయాన్ని తమ్మినేని వీరభద్రం గుర్తు చేశారు.
Kunamneni Sambasiva Rao
తమతో బీఆర్ఎస్ పొత్తు ఉండదని గుర్తించిన వామపక్షాలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నాయి. అయితే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై కాస్తా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ మనసు మారిందని చెప్పిక సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసే పోటీచేస్తాయని చెప్పారు. అయితే, ప్రజాతంత్ర శక్తులతో కలిసి పోటీ చేస్తాయని ఆయన చెప్పారు. ఆ ప్రజాతంత్ర శక్తులు ఏవనే విషయాన్ని గుర్తించడానికి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Tammineni
తమతో కలిసి వచ్చే పార్టీలతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. సిపిఐతో కలిసి వెళ్తామని చెప్పిన తమ్మినేని కాంగ్రెస్ తో కలిసి వెళ్లే విషయంపై సంకేతాలు ఇచ్చారు. తమకు కాంగ్రెస్ కూడా ఉందనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ తో పొత్తుకు వామపక్షాలు సిద్ధపడుతాయా, ఈ విషయంలో సిపిఐ, సిపిఎం కలిసి ఒక నిర్ణయానికి వస్తాయా చూడాల్సిందే. అదే సమయంలో కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుందనేది కూడా చూడాల్సిందే. కాంగ్రెస్ తో వామపక్షాలు కలిసి పనిచేసే విషయం ఇప్పుడు ప్రాథమిక స్థాయి ఆలోచన మాత్రమే.