కాంగ్రెస్ గూటికి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు..? ప్రచారంపై డికె అరుణ క్లారిటీ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే డికె అరుణ కూడా బిజెపిని వీడి సొంతగూటికి చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా డికె అరుణ స్పందించారు.
DK Aruna
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బిజెపికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిమరి కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరిన ఆయన తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ లాంటి మరికొందరు కూడా తిరిగి కాంగ్రెస్ చేరతారంటూ సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇలా బిజెపిని వీడనున్నట్లు... కాంగ్రెస్ లో చేరి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై డికె అరుణ స్పందించారు.
dk aruna
తాను బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నానని జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని అరుణ స్పష్టం చేసారు. తాను కాంగ్రెస్ ను వీడిన తర్వాత ఇప్పటివరకు ఎప్పుడూ ఆ పార్టీవైపు తిరిగి చూడలేదని అన్నారు. బిజెపి తనకు రాజకీయంగా మంచి అవకాశాలు ఇస్తోందని... మహిళనైన తనకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిని ఇచ్చి గౌరవించిందని అన్నారు. అలాంటి పార్టీని వీడే ప్రసక్తే లేదని అరుణ అన్నారు.
DK Aruna
ఎన్నికల వేళ తప్పుడు ప్రచారాలు చేయడంద్వారా లబ్ది పొందాలని చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నారని డికె అరుణ మండిపడ్డారు. తనలాంటి సీనియర్లు పార్టీ మారుతున్నారంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తాను పార్టీ మారుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియా విభాగం ప్రచారం చేస్తోందన్నారు. ఈ ప్రచారమే నిజమని నమ్మి కొన్ని మీడియా సంస్థలు తాను బిజెపిని వీడుతున్నట్లు కథనాలను ప్రసారం చేస్తోందని... ఇందులో ఏమాత్రం నిజం లేదని అరుణ అన్నారు.
dk aruna
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో పయనిస్తోందని డికె అరుణ అన్నారు. ఇలాంటి గొప్పవ్యక్తి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తానని అన్నారు. తెలంగాణలోనూ బిజెపి పాలన తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఇలాంటి సమయంలో కావాలనే తనలాంటి కొందరు సీనియర్లపై పార్టీ మారతానంటూ తప్పుడు ప్రచారానికి తెరలేపారని డికె అరుణ అన్నారు.
DK Aruna
తన స్పందన ఏమిటో తెలుసుకోకుండానే కాంగ్రెస్ లో చేరతానని ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలపై డికె అరుణ సీరియస్ అయ్యారు. తన రాజకీయ భవిష్యత్ ను కూడా మీడియా నిర్ణయిస్తుందా..? అని ప్రశ్నించారు. తాను బిజెపిని వీడుతున్నానని... కాంగ్రెస్ లో చేరతానని ప్రచారం చేసినవారిపై, మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. వీరిపై పరువునష్టం దావా వేయనున్నట్లు బిజెపి నాయకురాలు డికె అరుణ హెచ్చరించారు.