తెలంగాణ ఎన్నికలు యమ కాస్ట్లీ గురూ... పదిరోజుల్లో పట్టబడిన సొమ్మెంతో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడుతున్న బంగారం, నగదు చూసి కళ్లు బైర్లుకమ్మేలా వుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబడిన మొత్తం సొత్తుకంటే రెట్టింపు సొత్తు ఈ పదిరోజుల్లోనే పట్టుబడింది.
telangana assembly
హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత అన్నిపార్టీలు, అభ్యర్థులు ప్రజల్లోకి వుంటున్నారు. ఇలా ఇప్పటికయితే మాటలు, హామీలతోనే ఓటర్లకు దగ్గరయ్యేందుకు చూస్తున్నారు అన్నిపార్టీల అభ్యర్థులు. ఓటింగ్ సమయానికి ఈ ప్రచారం మరింత ముదిరి డబ్బు, మద్యం, కానులక పంపిణీకి దారితీస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఒక్కో రాజకీయ పార్టీ వందలు, వేల కోట్లను ఖర్చుచేస్తుంది. అభ్యర్థులు కూడా గెలుపుకోసం పార్టీ ఇచ్చే డబ్బులనే కాకుండా సొంత డబ్బును ఖర్చుచేస్తుంటారు.
Telangana Assembly
అయితే గతంతో పోలీస్తే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహం ఎక్కువయినట్లు కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఏకంగా రూ.243 కోట్ల సొత్తు పోలీసుల తనిఖీల్లో పట్టుబడిందంటేనే ఈ ఎన్నికలు ఎంత కాస్ట్లీగా వుండనున్నాయో అర్థమవుతుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా రూ.103 కోట్ల సొత్తు పట్టుబడితే ఇప్పుడు కేవలం పదిరోజుల్లోనే అంతకంటే రెట్టింపు సొత్తు పట్టుబడింది. రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు వుండటంతో గెలుపుకోసం ఎంతయినా ఖర్చుచేయడానికి పార్టీలు, అభ్యర్థులు సిద్దంగా వున్నారు. దీంతో ఇప్పటినుండే నగదు, కానుకలు సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసుల తనిఖీల్లో కొందరు పట్టుబడుతున్నారు... ఇలా పోలీసులకు చిక్కుతున్న సొత్తు చాలా తక్కువనే చెప్పాలి.
Gold
కేవలం బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకు అంటే 24 గంటల్లోనే ఏకంగా 83 కిలోల బంగారం పట్టుబడింది. నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ లాజిస్టిక్ సంస్థకు చెందిన వాహనంలో బంగారం, వెండి ఆభరణాలను తరలిస్తుండగా పట్టుబడ్డాయి. 40 కిలోల బంగారం, 190 కిలోల వెండి ఆభరణాలను ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తుండటంతో స్వాధీనం చేసుకున్నట్లు... వీటి విలువు రూ.26 కోట్లవరకు వుంటుందని పోలీసులు తెలిపారు. ఇదేరోజు రాత్రి హైదరాబాద్ నారాయణగూడలో ఓ వాహనంలో తరలిస్తున్న 13.5 కిలోల బంగారం పట్టుబడింది. ఇలా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కిలోల కొద్దీ బంగారం పట్టుబడింది.
cash
తెలంగాణలోఅసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో అక్టోబర్ 9 నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటినుండి రాష్ట్ర బార్డర్ల వద్ద, జాతీయ రహదారులపై పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు చేపడుతున్నారు. దీంతో ఈ పదిరోజుల్లో అంటే అక్టోబర్ 9 నుండి 19 వరకు రూ.243,76,19,296 కోట్ల సొత్తు పట్టుబడినట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది. కేవలం బుధవారం నుండి గురువారం ఉదయం వరకే రూ.78 కోట్ల విలువైన సొత్తు పట్టుబడిందట.
Telangana
పోలీసులకు పట్టుబడుతున్న సొత్తులో ఎక్కువగా బంగారం, వెండి వుంటోంది. ఇక నగదుతో పాటు మద్యం, మత్తు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. చీరలు, వంటసామాగ్రి, నిత్యావసర సరుకులు, ల్యాప్ టాప్, ట్యాబ్లెట్లు, సెల్ ఫోన్లు వంటివి ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్దం చేసుకుంటుండగా పట్టుబడుతున్నాయి.
Telangana Assembly
ఎవరయినా వ్యక్తిగత పనులపై నగదు, బంగారం తీసుకెళుతుంటే వాటికి సంబంధించిన సరైన పత్రాలు వెంటపెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. రూ.50 వేలకు మించిన నగదు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళుతూ పట్టుబడితే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.