Telangana Rains :ఈ జిల్లాల తెలుగు ప్రజలు బిఅలర్ట్... ప్రాణాలు తీస్తున్న భారీ వర్షాలు
తెలుగు ప్రజలు బి అలర్ట్. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు, పిడుగులు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తెలుగు రాష్ట్రాల రైతులకు గుడ్ న్యూస్
Telugu States Weather updates : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. మే చివర్లోనే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకాయి... దీంతో ఎండాకాలం చివర్లోనే వర్షాలు మొదలయ్యాయి. తీరా జూన్ ఆరంభంలో అంటే ఈ నెలలో సాధారణంగా వర్షాకాలం మొదలై తొలకరి జల్లులు కురవాల్సిన సమయంలో మేఘాలు ముఖం చాటేసాయి. దీంతో అప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించి విత్తనాలు విత్తుకున్న రైతులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా మళ్ళీ వర్షాలు మొదలవడంతో అన్నదాతల కళ్లలో ఆనందం కనిపిస్తోంది.
హైదరాబాద్ లో భారీ వర్షం
ప్రస్తుతం తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులపాటు ఈ వర్షాల జోరు ఇలాగే కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.
నిన్న(గురువారం) హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. లింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో అయితే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. కూకట్ పల్లి, మియాపూర్, మాదాపూర్, చందానగర్, పటాన్ చెరు, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి నీరు చేరాయి.. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
ఇవాళ(శుక్రవారం) కూడా వర్షం కురిసే అవకాశం ఉండటంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులతో పాటు ఉద్యోగులు, చిరు వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి... రద్దీ సమయానికంటే ముందు లేదంటే తర్వాత ఇంటికి బయలుదేరడం మంచిది. వర్షం కురిసే సమయంలో రోడ్డుపై ఉండకుండా జాగ్రత్తపడాలి.
ఈ తెలంగాణ జిల్లాల్లో నేడు వర్షాలు
ఇక తెలంగాణ జిల్లాల విషయానికి వస్తే శుక్రవారం ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ వర్ష సమయంలో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇలా ఇవాళ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.
ఆంధ్ర ప్రదేశ్ లో నేడు ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే..
రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజులపాటు అక్కడక్కడ భారీ, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వర్షాలకు ఈదురుగాలులు, పిడుగులు తోడయి ప్రమాదాలు సంభవించే అవకాశాలుంటాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరీముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శుక్రవారం పార్వతీపురం మన్యం, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలున్నాయని హెచ్చరించారు. మిగతా జిల్లాల్లో కూడా ఆకాశం మేఘాలతో కప్పేసి అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని… మిగతాచోట్ల వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో పిడుగులు పడి ఆరుగురు మృతి
గురువారం తెలంగాణలో భారీ వర్షం కురిసింది.. ఇలా ఆదిలాబాద్ లో వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. జిల్లాలోని గాదిగూడ మండలం పిప్పిరిలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలపై పిడుగు పడింది. దీంతో ఆరుగులు ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు.
వర్షం కురుస్తుండటంతో 14మంది కూలీలతో వ్యవసాయ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షం నుండి రక్షణ కోసం కూలీలంతా ఓ గుడిసెలో ఉండగా పిడుగు పడింది... దీంతో నలుగురు అక్కడిక్కడే మరణించగా మరో ఇద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. మిగతావాళ్లు ప్రస్తుతం ఆదిలాబాద్ రుయాలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.