- Home
- Telangana
- Telangana Rains : ఓ అల్పపీడనం తీరంలో, మరొకటి సముద్రంలో..? నేడు ఈ జిల్లాల్లో వర్షబీభత్సమేనా?
Telangana Rains : ఓ అల్పపీడనం తీరంలో, మరొకటి సముద్రంలో..? నేడు ఈ జిల్లాల్లో వర్షబీభత్సమేనా?
బంగాళాఖాతంలో ఏర్పడిన ఓ అల్పపీడనం తీరందాటింది… ఇదే సమయంలో మరో అల్పపీడనం ఏర్పడేలా వాతావరణం ఉందట. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షబీభత్సం కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నేడు ఏ జిల్లాల్లో వర్షాలుంటాయంటే…

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షబీభత్సం తప్పదా?
Andhra Pradesh and Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వర్షబీభత్సం కొనసాగుతోంది. గత ఆగస్ట్ నెలంతా కుండపోత వర్షాలు కురిశాయి... నెల మారినా పరిస్థితి మాత్రం మారడంలేదు. సెప్టెంబర్ లో కూడా ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలను బట్టి అర్థమవుతోంది. ఇలా ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు జోరందుకోగా ఇవాళ(గురువారం) మరింత విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
రాబోయే మూడ్రోజులు తెలంగాణలో జోరువానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే తీరం దాటింది... ఇది ఒడిషాలో స్థిరంగా ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో నేడు(గురువారం) తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాబోయే మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా జోరువానలు ఉంటాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
గురువారం భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నిర్మల్, కొత్తగూడెం, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుండి అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక హైదరాబాద్ తో పాటు శివారుజిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్సడిన అల్పపీడనం తీరందాటిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉత్తరాంధ్ర జిల్లాలు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది. కాబట్టి ఈ జిల్లాల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
భారీ వర్షాలకు ఈదురుగాలులు కూడా తోడవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో తీరంవెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని... సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని సూచించింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం?
అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అంటే ఇప్పటికే ఓ అల్పపీడనం తీరందాటగా మరోటి రెడీ అవుతోందన్నమాట… దీన్నిబట్టి ఇప్పట్లో ఈ వర్షాలు తగ్గే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్లాష్ ప్లడ్స్ సంభవించే ప్రమాదం ఉంటుంది... కాబట్టి లోతట్టుప్రాంతాలు, నదులు, చెరువుల, వాగులువంకల సమీపంలోని ప్రాంతాల తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.