రైతు భరోసా డబ్బులు రాలేదా..? అయినా పర్లేదు..టెన్షన్ పడొద్దు..ఇలా చేయండి చాలు!
రైతు భరోసా నిధులుగా మొదటి దశలో 2,349 కోట్లు జమ. మిగిలిన అర్హులందరికీ రానున్న 9 రోజుల్లో డబ్బులు అందనున్నట్లు మంత్రి తుమ్మల తెలియజేశారు.

రైతు భరోసా
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలలో భాగంగా 'రైతు భరోసా' నిధులను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (జూన్ 16) విడుదల చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో ఈ నిధుల విడుదల జరిగింది. అదేరోజు పలువురు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయినప్పటికీ, కొందరికి నిధులు రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది.
తొలి రోజు కేవలం 2 ఎకరాల లోపు
ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, తొలి రోజు కేవలం 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే నిధులు జమ చేశామని చెప్పారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున ఈ సాయం అందించినట్లు తెలిపారు.
మొత్తం విడుదలైన నిధులు
రైతుల సంఖ్య: 41.25 లక్షలు,సాగుబడి భూమి: 39.16 లక్షల ఎకరాలు,నిధుల మొత్తం: ₹2,349.83 కోట్లు
మిగిలిన రైతులకు మంత్రి హామీ
తొలి విడతలో డబ్బులు రాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మిగిలిన అర్హులందరికీ రానున్న 9 రోజుల్లో 'రైతు భరోసా' నిధులు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఎవరైనా ఈ నిధులు పొందలేకపోతే, స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.
దండగ కాదు, పండుగ
రైతు సంక్షేమం కోసం గత 18 నెలల్లో రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మద్దతు ధర, బోనస్ చెల్లింపు, రైతు బీమా వంటి పథకాలు ఉన్నాయి. ఇంకా మాట్లాడుతూ, “వ్యవసాయం దండగ కాదు, పండుగగా మారాలన్నదే మా సంకల్పం” అని చెప్పారు. వాణిజ్య పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, రైతులకు అవసరమైన పనిముట్లు, సౌకర్యాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
సోలార్ విద్యుత్ ప్రణాళికలు
: ప్రస్తుతం ఉచిత విద్యుత్‌కు ఏటా రూ.17 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, దీన్ని సోలార్ విద్యుత్‌తో భద్రపరిస్తే, అది ఉచితం మాత్రమే కాకుండా, అదనపు ఆదాయం కూడా తెస్తుందని తెలిపారు. ఒక్కో కుటుంబానికి నెలకు రూ.2,000–3,000 అదనంగా వచ్చేలా సోలార్ పంపు సెట్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.