రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గతంత్ర వేడుకలు.. అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ఇద్దరు
దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి మొదలు తెలుగు రాష్ట్రాల వరకు ప్రముఖులు జాతీయ జెండా ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిచారు. అనంతరం సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Telangana
తెలంగాణలో వేడుకలు
తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. వ్యయవసాయం రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముక అని అభివర్ణించారు. తమ ప్రభుత్వం 25 లక్షల మందికిపైగా రైతుల రుణమాఫీ చేసిందని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అందిస్తోందని అన్నారు. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నామని చెప్పుకొచ్చారు. సన్నరకం బియ్యానికి బోనస్ అందించామని, 2024 వానా కాలంలో 1.59 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేశామని తెలిపారు. ఉచిత బస్సు రవాణాతో మహిళలకు రూ.4,500 కోట్లు ఆదా అయ్యిందన్నారు. 50 లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి అందిస్తున్నాన్న గవర్నర్, యువత సాధికారత కోసం యంగ్‌ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రిక కట్టడాలను మూడు రంగుల జెండాలు, లైట్లతో అలంకరించారు. మరోవైపు సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు గవర్నర్.
Lokesh Pawan
ఏపీలో..
ఆంధ్రప్రదేశ్‌లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర పాల్గొన్నారు. కాగా ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరు కలిసి వేడుకలకు హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది. శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్న గవర్నర్, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. కాగా గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జలవనరుల శాఖ, అటవీ శాఖ, రైతు సాధికార సంస్థ, వ్యవసాయ శాఖ శకటాల ప్రదర్శన జరిగింది.
CM KCR
కేసీఆర్ శుభాకాంక్షలు..
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పరాయి పాలనలో మగ్గిన భారతదేశానికి వెలకట్టలేని త్యాగాలతో సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్ర్య ఫలాలు, దేశంలోని ప్రతి గడపకూ చేరిన నాడే రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చినవారం అవుతామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామిక స్వయం పాలనను అమలులోకి తెచ్చి, భారతదేశాన్ని సార్వభౌమాధికార, గణతంత్ర దేశంగా నిలుపుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 ఏండ్లయిందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.