హుజూరాబాద్ బైపోల్: బీజేపీకి ఆ సెంటిమెంట్ కలిసి వచ్చేనా?
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపై అన్ని పార్టీలు కేంద్రీకరించాయి.. ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ ఇప్పటి నుండే ప్లాన్ చేస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డిని ఇంచార్జీగా బీజేపీ నియమించింది.జితేందర్ రెడ్డిని ఇంచార్జీగా మంచి ఫలితాలు రావడంతో మరోసారి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో జితేందర్ రెడ్డిని బీజేపీ నియమించింది.ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ బరిలోకి దిగుతోంది.
గతంలో కమలాపూర్ నుండి ఆ తర్వాత హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆరు దఫాలు ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ దఫా మాత్రం బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు.
నియోకవర్గంలో ఇప్పటికే ఈటల రాజేందర్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈటల రాజేందర్ సతీమణి జమున కూడ ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ కీలక నేతలు మకాం వేశారు. ర్యాలీల్, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఈటల రాజేందర్ ఈ దఫా కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ గుర్తు కారుపై ఈటల రాజేందర్ పోటీ చేశారని బీజేపీ శ్రేణులు ఓటర్లకు వివరిస్తున్నారు.
హుజూరాబాద్ నియోజక వర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో జితేందర్ రెడ్డిని ఆ తరువాత స్థానంలో ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన యండల లక్ష్మి నారాయణ, మాదిగ సామజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న చంద్రశేఖర్ లను సహ ఇంచార్జీ లుగా నియమించింది.
దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను ఇంచార్జీగా ఉన్న స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించేలా జితేందర్ అనుసరించిన ప్లాన్ సక్సెస్ అయిందని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడ జితేందర్ అనుసరించిన ప్లాన్ కూడ కలిసి వచ్చిందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.
.ప్రతి మండలాలకు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలను ఇంచార్జీలుగా నియమించాలని బీజేపీ ప్లాన్ యోచిస్తోంది. ఎమ్మెల్యే రఘునందన్ రావు లాంటి నేతలు పూర్తి స్థాయి సమయాన్ని హుజురాబాద్ లోనే కేటాయించేలా ప్లాన్ చేస్తోంది.
హుజూరాబాద్ లో ఆత్మగౌరవ నినాదాన్ని బీజేపీ ప్రధానంగా ప్రస్తావించనుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇదే విషయాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలను కూడ రాజేందర్ ఈ ప్రచారంలో ప్రస్తావించనున్నారు.
ఈ ఎన్నికల్లో విజయం సాధించడం బీజేపీకి అనివార్యం. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తేనే రాజకీయంగా టీఆర్ఎస్ పై ఆయన పై చేయిసాధించినట్టు అవుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో విజయం కోసం రాజేందర్ తో పాటు కమలదళం కూడ విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది.
జితేందర్ రెడ్డి సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో బీజేపీకి కలిసివస్తోందో లేదో అనే విషయాన్ని ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.