- Home
- Telangana
- Rain Alert : బంగాళాఖాతంలో మరోసారి అల్లకల్లోలం.. ఈ ప్రాంతాల్లో సాయంత్రం ఒక్కసారిగా వెధర్ చేంజ్, ఎల్లో అలర్ట్
Rain Alert : బంగాళాఖాతంలో మరోసారి అల్లకల్లోలం.. ఈ ప్రాంతాల్లో సాయంత్రం ఒక్కసారిగా వెధర్ చేంజ్, ఎల్లో అలర్ట్
Rain Alert : ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా మళ్లీ వర్షాలు జోరందుకోనున్నాయి. ఎందుకంటే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
Rain Alert : తెలుగు రాష్ట్రాలను ఇప్పట్లో వర్షాలు వదిలిపెట్టేలా లేవు... ఇప్పటికే బంగాళాఖాతంలో అనేక అల్పపీడనాలు ఏర్పడగా తాజాగా మరొకటి రెడీగా ఉందట. వాతావరణ పరస్థితులు అనుకూలంగా ఉండటంతో రేపు (అక్టోబర్ 1, బుధవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ జోరందుకుంటాయని... ఇలా ఈవారం కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
ఇవాళ (సెప్టెంబర్ 30, మంగళవారం) తెలంగాణలో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి., జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) September 29, 2025
హైదరాబాద్ లో వర్షాలు
ఇక నేడు హైదరాబాద్ లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగానే ఉంటుందని... సాయంత్రం అక్కడక్కడ వర్షం కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అలాగే శివారు జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరిలో కూడా ఇదే వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులతో పాటు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తోడవుతాయని తెలిపారు.
నేడు ఏపి వాతావరణ పరిస్థితి
ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇవాళ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్ధ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున1.5 & 5.8 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడకక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
గోదావరి, కృష్ణమ్మల ఉగ్రరూపం
ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణాతో పాటు ఇతర నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని ఏపీ విపత్తు సంస్థ తెలిపింది. అందుకే ముందుజాగ్రత్తగా సహాయక చర్యల కోసం 2 NDRF, 4 SDRF బృందాలను కృష్ణా, గుంటూరు, బాపట్ల, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నదీపరీవాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులు
కృష్ణా నదిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,41,247 క్యూసెక్కులుగా ఉంది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇక గోదావరి నది నీటిమట్టం భద్రాచలం వద్ద 45.70అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో9.71,784 లక్షల క్యూసెక్కులుగా ఉందని... రేపటికి దాదాపు 12 నుంచి 12.5 లక్షల క్యూసెక్కులకు వరద చేరే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.