- Home
- Andhra Pradesh
- Rain Alert : తుఫాను బీభత్సం.. ఇక్కడ అల్లకల్లోలం, భారీ వానలతో చిగురుటాకుల్లా వణికిపోతున్న ప్రాంతాలు
Rain Alert : తుఫాను బీభత్సం.. ఇక్కడ అల్లకల్లోలం, భారీ వానలతో చిగురుటాకుల్లా వణికిపోతున్న ప్రాంతాలు
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి… మరికొన్నిరోజులు ఇవి కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నేడు ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నయి. వర్షాకాలం దాదాపు ముగిసినట్లే... అయినా వరుణుడు శాంతించడంలేదు... సాధారణ వర్షాలు కాదు వరదలను సృష్టించేస్థాయిలో కుండపోత వానలు కురుస్తున్నాయి. తాజాగా దసరా పండగ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు ముంచెత్తడంతో నదులు, వాగులువంకలు ఉగ్రరూపం దాల్చాయి... ఇలా వంశధార, నాగావళి నదులు ఉప్పొంగడంతో ఉత్తరాంధ్ర జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. తీవ్ర ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టాన్ని మిగిల్చింది.
వరద బాధిత కుటుంబాలకు ఏపీ సర్కార్ ఆర్థికసాయం
ఇలా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరద ప్రవాహాలపై ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో ఒకరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.
నేడు ఏపీలో భారీ వర్షాలు
వరద పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే భయటపడుతున్న ఆంధ్ర ప్రదేశ్ ను పిడుగులతో కూడిన వర్షాలు కంగారు పెట్టిస్తున్నారు. సోమవారం (అక్టోబర్ 6న) ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఇక మిగతా జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆదివారం అత్యధిక వర్షపాతం ఇక్కడే
ఆదివారం (అక్టోబర్ 5) కూడా ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిశాయి... సాయంత్రం 5 గంటల వరకు కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 79.7మిమీ, పల్నాడు జిల్లా గుట్లపల్లిలో 60మిమీ, నెల్లూరు జిల్లా జలదంకిలో 33.5మిమీ వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
నేడు తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ (సోమవారం, అక్టోబర్ 6న) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, సిద్దిపేట జిలాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ లో వర్షాలు
హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి లో కూడా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గత రాత్రి వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
హిమాలయాల్లో మంచు తుఫాను
ఇదిలావుంటే హిమాలయాలను మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. ఎవరెస్ట్ పర్వతప్రాంతంలో టిబెట్ వైపు మంచుతుఫాను విరుచుకుపడటంతో 16 వేల అడుగుల ఎత్తులో వేయిమందికి పైగా పర్వతారోహకులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 200 మందిని స్థానికులు, రెస్క్యూ టీమ్ కాపాడాయి... మిగతావారిని కూడా సురక్షితంగా తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.